ఇసుక తవ్వకాల నిలిపివేత | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాల నిలిపివేత

Published Sat, Aug 27 2016 8:54 PM

ఇసుక తవ్వకాల నిలిపివేత - Sakshi

 ‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు
 చోడవరం ఇసుక క్వారీ వద్ద హైడ్రామా
 బోడె ప్రసాద్, నెహ్రూ వర్గాల మధ్య ముదిరిన వివాదం
 
పెనమలూరు :
 మండలంలోని చోడవరం ఇసుక క్వారీలో తవ్వకాలను అధికారులు ఎట్టకేలకు నిలిపివేశారు. ఇసుక క్వారీలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా చోడవరం ఇసుక క్వారీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు పొక్లెయిన్లతో ఇసుక దందాకు పాల్పడుతున్నారని సాక్షిలో ‘ఇసుక దందా మళ్లీ మొదలైంది’ కథనం రావటంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. క్వారీలో ఉన్న ఇద్దరు నేతల అనుచరులకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ప్రకారం నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్రమణ్యేశ్వరరావు ఆదేశించారు.lఇరువురు నేతల మధ్య ఆధిపత్యపోరు కారణంగా ఇసుక క్వారీ వద్ద నదిలో పొక్లయిన్‌ తొలగించే విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చివరకు అధికారుల జోక్యంతో ఇసుక తవ్వకాలు నిలిపివేయించారు.
ఏమి జరిగిందంటే...
చోడవరం ఇసుక క్వారీపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇద్దరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు భారీ యంత్రాలతో చేపట్టారు. వీరి పోరుతో శాంతిభద్రతల సమస్యతోపాటు, కరకట్టపై భారీగా ఇసుక లారీలు నిలుపుదల చేయటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఇక్కడి పరిస్థితిపై సాక్షిలో కథనం రావటంతో అధికారులు స్పందించారు. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు ప్రకారం ఇసుక తవ్వకాలు యంత్రాలతో చేయరాదని మైన్స్‌ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తవ్వుతున్న క్వారీలో తవ్వకాలను వీఆర్వో లావణ్య ఆపించారు. ఆతరువాత నెహ్రూ అనుచరుల వద్దకు వచ్చి తవ్వకాలు ఆపాలన్నారు. దీనికి వారు అభ్యంతరం తెలిపారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఉన్నా ఇంతకాలం ఎమ్మెల్యే ఇసుక ఎందుకు తవ్వించాడని ప్రశ్నించారు. ఆయన పొక్లెయిన్‌ నది నుంచి బయటకు రప్పిస్తే, తమ పొక్లెయిన తీస్తామన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వీఆర్వో చివరికి లారీలను నదిలోకి అనుమతించకుండా ఆపటంతో ఇరువురు తవ్వకాలు ఆపారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement