ఇసుక మేట.. అవినీతి ఊట | Sakshi
Sakshi News home page

ఇసుక మేట.. అవినీతి ఊట

Published Sat, Oct 29 2016 9:46 PM

ఇసుక మేట.. అవినీతి ఊట - Sakshi

నామ మాత్రపు కేసులతో సరిపెట్టిన పోలీసులు
మళ్లీ రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఆ మూడు శాఖలకు భారీ ముడుపులు
 
ప్రకృతి సంపద పరులపాలవుతోంది. ప్రజలకు అందాల్సిన ఇసుక..అక్రమార్కుల చెరలో చిక్కి సరిహద్దులు దాటుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ నిద్ర నటిస్తోంది. ఇదే అదనుగా మరింత రెచ్చిపోతున్న అధికార బలం..అడ్డూఅదుపూ లేకుండా ఇసుకను తోడేళ్లు మాదిరిగా తవ్వేస్తూ జేబులు నింపుకుంటుంది. 
 
 
సాక్షి, అమరావతి బ్యూరో: ఇసుక మాఫియాలో కీలకమైన ముగ్గురు శాసనసభ్యులుతోపాటు మరో ప్రజాప్రతినిధి సోదరుడు ఉండడంతో వారి అనుచరులపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలున్నాయి. నిత్యం లక్షల్లో జరుగుతున్న అక్రమ వ్యాపారం అధికార పార్టీ నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
 
తాత్కాలిక సచివాలయం పేరుతో..
ఉచిత ఇసుక విధానం టీడీపీ నేతలకు వరంలా మారింది. స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను వాడుకోవాలి. ఇతర రాష్ట్రాలకు తరలించకూడదనే నిబంధనలున్నాయి. రాజధాని ప్రాంత రేవుల నుంచి తాత్కాలిక సచివాలయ పేరుతో ఇసుకను తోడేస్తున్నారు. వేలల్లో లారీలు తరలివెళుతున్నా దీనికి సంబంధించిన లెక్కలు మాత్రం ఒక్కటీ లేవు. క్వారీల వద్ద టీడీపీ నేతల అనుచరులు దగ్గరుండి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. 
 
సరిహద్దులు దాటుతున్నాయి..
గుంటూరు జిల్లాలో కోనూరు, కోగంటివారిపాలెం, కస్తల, దిడుగు, మల్లాది, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం, రాయపూడి, లింగాయపాళెం, ఉద్దండ్రాయునిపాలెం, పెనుమాక, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, బోరుపాలెం, దుగ్గిరాల, ఉండవల్లి, రేపల్లె రీచ్‌ల నుంచి అక్రమ రవాణా సాగుతోంది. కృష్ణా జిల్లా గరికపాడు, వీరులపాడు, మండలం పెద్దాపురం, నందిగామ మండలం జొన్నలగడ్డ, వత్సవాయి, జగ్గయ్యపేట మండలం ముక్త్యాల చెక్‌పోస్టు నుంచి ఖమ్మం, నల్గొండ్ల సరిహద్దులు దాటి తెలంగాణలోకి వెళుతుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల మీదుగా ఇసుక తరలిస్తున్నారు నందిగామ డివిజన్‌లోని ఐదు చెక్‌ పోస్టులు ఆదాయ వనరులుగా మార్చుకున్నారు.
 
డొంక దారుల గుండా రవాణా..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద విశాఖ మైన్స్, బూదవాడ మీదగా పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు, శివాపురం, మాచినేనిపల్లి మీదుగా షేర్‌ మహ్మద్‌ పేట, గుండ్రాయి మీదుగాడొంక దారుల్లో తెలంగాణకు తరలిస్తున్నారు. చెన్నైకు జాతీయ రహదారులపైనే పంపిస్తున్నారు. హైవే వెంబడి పోలీసులను మేనేజ్‌ చేస్తున్నారు ఇసుక యూనిట్‌ రూ.10 వేలకుపైగా ధర పలుకుతోంది. దీని ప్రకారం ఆరు యూనిట్ల లారీకి రూ.60 వేలు వస్తుంది. లారీకి ఖర్చులుపోను రూ.20 వేలు మిగులుతుంది.
 
కీలక నేతలపై కేసులేవీ..
గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో కస్తల రీచ్‌ నుంచి రెండు లారీలు నందిగామ డివిజన్‌ నుంచి సరిహద్దులు దాటిస్తుండగా పోలీస్‌ అధికారి దాడులు చేసి పట్టుకున్నారు. లారీలతోపాటు వాటికి పైలెట్‌గా వెళ్లిన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే వారంతా అమరావతి, మల్లాది ప్రాంతాలకు చెందిన చోటా వ్యాపారుల కావడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. అయితే వీరి వెనుక ఉన్న బడా నేతల జోలికి మాత్రం వెళ్లడం లేదు.

Advertisement
Advertisement