ఇసుక గోతులతో ఉసురు తీస్తారా? | Sakshi
Sakshi News home page

ఇసుక గోతులతో ఉసురు తీస్తారా?

Published Thu, Aug 18 2016 12:51 AM

ఇసుక గోతులతో ఉసురు తీస్తారా?

సీతానగరం: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలతో జేబులు నింపుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి (సీజీసీ) సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు.  సీతానగరంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నీరు లేనపుడు కృష్ణా నదిలో టీడీపీ నేతలు గుంటలు చేసి ఇసుక అమ్ముకుని, పుష్కరాల్లో అవే గుంటల్లో పడి ఐదుగురు విద్యార్థుల మరణానికి కారణమయ్యారని విమర్శించారు. గత కృష్ణా పుష్కరాల్లో ఇద్దరు చనిపోతే నాటి సీఎం వైఎస్‌ రాజీనామాకు డిమాండ్‌ చేసిన టీడీపీ నేతలు గోదావరి పుష్కరాల్లో 29 మంది, కృష్ణా పుష్కరాల్లో ఐదుగురి మరణాలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. పుష్కరాల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, ఆయన కృష్ణా జిల్లా ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
రైతుల తరపున ఉద్యమిస్తాం
ఖరీఫ్‌కు సాగునీరు అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయలక్ష్మి అన్నారు. అవసరమైతే తాము రైతుల తరఫున ఉద్యమిస్తామని చెప్పారు. కలవచర్ల పుష్కర లిఫ్ట్‌ ద్వారా సీతారాంపురం, మురారి, సింగరాయపాలెం, గాదరాడలలోని 4,500 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా, ఇప్పటి కేవలం 25 ఎకరాల్లో మాత్రమే ఊడ్పులయ్యాయన్నారు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులు క్రాఫ్‌ హాలిడే ప్రకటించే పరిస్థితులు కల్పించారన్నారు.
అధికార పార్టీ ధన దాహం వల్లే :పాపారాయుడు
మండపేట : అధికారపార్టీ నేతల ధన దాహం వల్లే కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు. కృష్ణానది పాయలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడానికి టీడీపీ నేతలు బాధ్యత వహించాలని ఆయనన్నారు. స్థానిక కామత్‌ ఆర్కేడ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోందని విమర్శించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారం అధికార పార్టీ నేతలు తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. పెద్దపెద్ద గోతులు ఏర్పడుతుండండగా నీళ్లు వచ్చిన తర్వాత అవి కానరాక అమాయక ప్రజలు, మూగజీవాలు వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement