ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు

Published Sun, Apr 24 2016 10:47 AM

ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు - Sakshi

ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
 
 పుట్టపర్తి టౌన్/అర్బన్: అశేష భక్తుల నడుమ సత్యసాయి పంచమ ఆరాధనోత్సవాలు ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలు ఉదయం 7.30 గంటలకు వేదపఠనంతో ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన 200 మంది సంగీత విద్వాంసులు ‘పంచరత్న కీర్తనలు’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాల ద్వారా భక్తుల మదిలో శాశ్వత స్థానం సంపాదించారని ఆయన కొనియాడారు.

అనంతరం సత్యసాయి విద్యాజ్యోతి పథకాన్ని వెంకయ్య చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. దేశీయంగా 900 గ్రామీణ విద్యాలయాలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఐదు లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతారని సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండే తెలిపారు. వేడుకలలో భాగంగా 40 వేల మందికి మహానారాయణ సేవ(అన్న, వస్త్రదానం) చేశారు. సాయంత్రం మాండలిన్ రాజు బృందం సంగీత కచేరీ నిర్వహించింది. కాగా, గ్రామ పంచాయతీలు బాగున్నప్పుడే రాష్ర్టం, దేశం బాగుంటాయని, గ్రామ వికాసమే దేశ వికాసమని వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు గ్రామ పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి 24 వరకు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిచిన్నట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement