తమ్ముళ్లకు తేరగా... | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు తేరగా...

Published Mon, Aug 1 2016 11:25 PM

Scam in Ration shops allottment

రేషన్‌షాపులు కట్టబెట్టేందుకు సన్నాహాలు
పోర్టబులిటీ ఉన్నా షాపుల విభజనకు నిర్ణయం
అప్పుడే డీలర్‌ పోస్టులకు మొదలైన పైరవీలు
 
 
విజయనగరం కంటోన్మెంట్‌: ఎలాగైనా తమ్ముళ్లకు ఓ దారి చూపించాలి. అది ఎలాగైనా సరే. అదే లక్ష్యంతో ఇప్పుడు రేషన్‌షాపులు విడగొట్టే యత్నం జరుగుతోంది. ఎక్కడి నుంచైనా రేషన్‌ పొందే అధునాతన సాంకేతిక విధానాన్ని సైతం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేందుకు వెనుకాడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ 500 కార్డులకూ ఓ రేషన్‌ షాపు ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవలే ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే  జిల్లాలోని రేషన్‌ షాపులను విభజించి కొత్తగా మరిన్ని షాపులు  ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 
పోర్టబులిటీ చక్కగా అమలవుతున్నా...
జిల్లాలో సుమారు 1390 రేషన్‌ షాపులున్నాయి. ఇందులో ఒక్కో షాపులో 300 నుంచి 3వేల వరకూ కార్డులున్నాయి. వీటిని ఇప్పుడు విభజించి తెలుగు దేశం నాయకులు సూచించిన వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యమైనది ఈపాస్‌ విధానం. ఇందులోని మరో ముఖ్యమైంది పోర్టబులిటీ. ఈ విధానంలో ఏ ప్రాంతంలోని వారైనా ఇతర ప్రాంతాల్లోని రేషన్‌ షాపుల్లో సరుకులు తీసుకోవచ్చు. ఈ విధానం జిల్లాలో బాగానే అమలవుతోంది. అయినా రేషన్‌ షాపుల విభజన కేవలం తెలుగు తమ్ముళ్లకు ప్రయోజనం కల్పించేందుకేనన్న వాదన వినిపిస్తోంది. 
 
 
మొదలైన పైరవీలు
జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని తెలుగు దేశం నాయకులు ఇప్పటికే కొన్ని షాపులను తమవారికి ఇవ్వాలని పట్టు బడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 34 మండలాల్లోని  తహసీల్దార్లకు ఓరల్‌గా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార ప్రభుత్వం ప్రతీ 500 రేషన్‌ కార్డులకూ ఓ షాపును ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రకటించడంతో అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది. కొందరు దీనిని బేరానికి పెట్టేశారని కూడా ప్రచారం సాగుతోంది. 
 
 
ఆదేశాలు రాలేదు:  జె.శాంతి కుమారి, డీఎస్‌ఓ, విజయనగరం
రేషన్‌ షాపుల క్రమబద్ధీకరణపై మాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం పోర్టమబులిటీ అవకాశం ఉంది. దీని వల్ల ఎవరికైనా రేషన్‌ షాపులు దూరమయినా, నచ్చకపోయినా వారికి నచ్చిన రేషన్‌ షాపులో సరుకులు తీసుకోవచ్చు. ఈ  నేపథ్యంలో ఈ క్రమబద్ధీకరణ అవసరం ఉండదనే అనుకుంటున్నాం. ప్రస్తుతం రేషన్‌ షాపుల విభజనకు సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు. . 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement