ఆత్మకూరులో స్కూల్‌డ్రింక్స్‌ | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో స్కూల్‌డ్రింక్స్‌

Published Tue, Aug 1 2017 9:53 PM

ఆత్మకూరులో స్కూల్‌డ్రింక్స్‌ - Sakshi

మద్యానికి బానిసైన విద్యార్థులు
తరగతి గదిలోనే మత్తులో జోగుతున్న వైనం
క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా ద్వారా మద్యానికి డబ్బు సర్దుబాటు


చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఏకంగా స్కూల్‌లోకి హాట్‌ డ్రింక్స్‌ తెచ్చుకుంటున్నారు. తరగతి గదిలోనే పూటుగా మద్యం తాగేసి మత్తులో జోగుతున్నారు. రెండు గ్రూపులుగా ఏర్పడి భౌతికదాడులు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు మందలించినా వారిలో మార్పు రావడం లేదు.

ఆత్మకూరు: మండల కేంద్రం ఆత్మకూరులోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొందరు పదో తరగతి విద్యార్థులు హద్దులు మీరారు. చదువులు పక్కనపెట్టి జూదాలకు బానిసలుగా మారారు. క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ వేస్తూ, మట్కా ఆడుతూ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన డబ్బును జూదాల ద్వారా సమకూర్చుకుంటున్నారు.

మద్యం మత్తులో..
ఆత్మకూరులో పది రోజులుగా మద్యం దుకాణాన్ని సీజ్‌ చేయడంతో విద్యార్థులకు మందు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సోమవారం ఉదయం కూడేరుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసుకుని వచ్చిన వారు.. పాఠశాల సమయంలోనే ఫుల్‌గా తాగారు. తరగతి గదిలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు దండించారు. వారి తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా వారిలో మార్పు మాత్రం కనిపించలేదు. పెడదోవ పడుతున్న విద్యార్థులకు టీసీలు ఇచ్చి బయటకు పంపించాలనే యోచనలో ఉపాధ్యాయులు ఉన్నారు.

బయటి వ్యక్తుల ప్రమేయంతోనే..
విద్యార్థులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులతో మంగళవారం ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ నరసింహారెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కందుల ఓబుళపతి సమావేశమై చర్చించారు. విద్యార్థులు తప్పుదోవలో నడవడానికి దారితీసిన కారణాలపై సమీక్షించారు. పాఠశాల బయట ఉన్న కొందరు జులాయిలతో స్నేహమే ఇందుకు కారణంగా తేల్చారు. దీనిపై కల్పించుకుంటే తమపై దాడులకు సైతం తెగబడేందుకు వారు వెనుకాడడం లేదంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వాపోయారు. పోలీసుల చర్యలతోనే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుందని, ఆ దిశగా పోలీసుల సాయం తీసుకోవాలని తీర్మానించారు.

Advertisement
Advertisement