ఎస్‌ఐ అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్టు | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్టు

Published Tue, Jan 3 2017 10:35 PM

ఎస్‌ఐ అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్టు - Sakshi

– రోజు వెయ్యి మందికి ఆహ్వానం
– మొదటి రోజు 687 మంది హాజరు
– 519 మంది రాత పరీక్షకు ఎంపిక
కర్నూలు: పోలీసు శాఖలో ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్‌ మ్యాట్రిన్‌ (మహిళలు) నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్టు ప్రక్రియ మంగళవారం ఏపీఎస్‌పీ రెండో పటాలం మైదానంలో ప్రారంభమైంది. రాయలసీమ పరిధిలోని కర్నూలు,కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్‌ఐ కొలువులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ టెస్ట్‌కు హాజరయ్యారు. ఉదయం 5.30 గంటలకే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా  మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలైంది. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్టుల సమాచారం ముందుగానే అందజేయడంతో మొదటి రోజు సుమారు 687 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం  ఎత్తు, ఛాతి కొలతలను పరీక్షించారు. అందులో అర్హత సాధించిన వారికి 100, 1600 పరుగు పరీక్షతో పాటు లాంగ్‌జంప్‌ నిర్వహించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్‌ తదితరుల పర్యవేక్షణలో ఈ  ప్రక్రియ కొనసాగింది. 
 
అప్పీల్‌కు అవకాశం:
  ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో (పీఎంటీ) సందేహాలుంటే అభ్యర్థులకు అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆయా అభ్యర్థులు చివరి రోజు 12వ తేదీ డీఐజీ రమణకుమార్‌కు అప్పీల్‌ చేసుకుని మరోసారి పీఎంటీకి హాజరు కావచ్చు. పీఎంటీతో పాటు 1600 మీటర్ల పరుగు పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ పరీక్షలకు అనుమతిస్తారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన అనంతపురం, కర్నూలు కేంద్రంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు 10079 మంది పురుషులు, 613 మంది మహిళలకు ఈ నెల 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
అభ్యర్థులకు సూచనలు:
అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు, రెండు జిరాక్స్‌ సెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. 
– ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో సందేహాలు ఉంటే అభ్యర్థులు ఈనె 12న అప్పీల్‌ చేసుకోవచ్చు.
– ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్‌ మ్యాట్రిన్‌ పోస్టుల్లో ఏదో ఒకదాని కోసమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగుతో పాటు, 100 మీటర్ల పరుగు లేదా లాంగ్‌ జంప్‌ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధించాలి. శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 18,19 తేదీల్లో తుది రాత పరీక్ష జరుగుతుంది. మొదటి రోజు ప్రతిభను కనబరిచి 519 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement