తిరుమలలో మరో ‘అక్షయ’ పాత్ర సిద్ధం | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో ‘అక్షయ’ పాత్ర సిద్ధం

Published Wed, Sep 14 2016 11:30 PM

అక్షయ వంటశాల భవనం

– బ్రహ్మోత్సవాల నుంచి రోజూ అదనంగా లక్షమందికి అన్నప్రసాదాలు 
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్షయ పాత్ర పేరుతో కొత్తగా రెండో వంటశాల నిర్మిస్తోంది. అదనంగా రోజూ లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు తయారు చేసేలా నిర్మించారు. బ్రహ్మోత్సవాల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. 31 వసంతాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని  మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 6,1985 సంవత్సరంలో రోజుకు రెండువేల మందితో ప్రారంభించి ప్రస్తుతం 1.27 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ప్రధానంగా తిరుమలలోని మాతశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రంతోపాటు  రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాలల ద్వారా రోజుకు రూ.1.06 లక్షల మందికి, తిరుపతి, తిరుచానూరులో మరో 26 వేల మందికి అన్నప్రసాదాలు తయారు చేసి ఉచితంగా వితరణ చేస్తున్నారు. 
సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు మాత్రమే ప్రస్తుతం వంటశాలలు సరిపోతున్నాయి. రద్దీ రోజుల్లోనూ, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లోనూ వచ్చే భక్తులకు ఇవి సరిపోవటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో లక్ష మందికి అన్నప్రసాదాలు వడ్డించాలని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. ఈ నేపథ్యంలో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వెలుపలే రోజుకు లక్ష మంది భక్తులకు  తయారు చేసేలా కొత్త వంటశాల భవనం నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనంలో ఉప్మా, మిరియాలు పొంగలి, కిచిడీ, పులిహోర, సేమియాబాత్, సాంబారు అన్నం, పెరుగు అన్నం వంటి అన్నప్రసాదాలు తయారి  వంటసామగ్రి యంత్రాలు అమర్చే పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఇక చంటి బిడ్డలు, వృద్ధులు, భక్తుల కోసం పాలు, కాఫీ, టీ వంటి పదార్థాలు అందించేందుకు పదివేల  లీటర్ల పాలు నిల్వ ఉండేలా 6 చిల్లర్లు (యంత్రాలు) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజూ 1.5 లక్షల మందికి పాలు, కాఫీ, టీ సరఫరా చేయవచ్చు. యంత్రాల అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. 
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్షయ సిద్ధం
‘‘అక్షయ కొత్త వంటశాలను బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. వంటశాలలో యంత్రాలు అమరిక వేగంగా సాగుతోంది. నిత్యాన్నప్రసాద భవనం, పీఏసీ వంటశాలతోపాటు కొత్త వంటశాల వల్ల 1.5 నుండి 2 లక్షల మందికి  అన్నప్రసాదాలు వడ్డించే అవకాశం కలిగింది. ఎంత మంది భక్తులు  వచ్చినా వారికి అన్నప్రసాదాలతోపాటు  వేడిపాలు, కాఫీ, టీ అందించే ఏర్పాట్లు చేశాం. 
– సాంబశివరావు, టీటీడీ ఈవో 
 
 
 

Advertisement
Advertisement