Sakshi News home page

సీఎం కేసీఆర్‌ది సెంట్‌మెంట్‌ పాలన

Published Thu, Aug 25 2016 7:56 PM

సీఎం కేసీఆర్‌ది సెంట్‌మెంట్‌ పాలన - Sakshi

  కాళేశ్వరం నీళ్లు తర్వాత.. ముందు పంట రుణాలు మాఫీ చేయి..
♦  ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దే
♦  కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌
యాచారంలో ఎండిపోయిన మొక్కజొన్న పంటల పరిశీలన

యాచారం: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సెంట్‌మెంట్‌ పరిపాలన చేస్తున్నారని, మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాడని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి మండిపడ్డారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో కలిసి యాచారం, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు తెచ్చేది దేవుడెరుగు.. ముందు పూర్తిగా రుణమాఫీ చేసి రైతుల కాళ్లు కడిగి ఓట్లేసిన వారి రుణం తీసుకోవాలని సూచించారు.

        బ్యాంకుల్లో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తెచ్చి అప్పులపాలవుతున్నారన్నారు. తెలంగాణలో 37 లక్షల మంది రైతులు, మూడున్నర లక్షల మహిళా రైతులు రుణమాఫీ పూర్తి అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి రుణమాఫీ వర్తింపజేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇస్తానన్న రూ. ఆరు లక్షల పరిహారం కేవలం 230 మందికే ఇచ్చి చేతులుదులుపుకున్నారన్నారు. ఆలస్యంగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని,  అధికార యంత్రాంగం తక్షణమే సర్వే చేసి ఎండిపోయిన పంటకు ఎకరారు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి: క్యామ మల్లేష్‌
గతేడాది రైతులకు అందజేయాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీని తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలోని వేలాది మంది రైతులకు రూ.80 కోట్లకు పైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాల్సి ఉందన్నారు. వరుసగా మూడేళ్లు జిల్లా తూర్పు డివిజన్‌లో వర్షాల్లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బోరుబావులు ఎండిపోయి, కృష్ణాజలాలు సరిపడా సరఫరా కాక ప్రజలకు సైతం తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ అధికార ప్రతినిధి అన్వష్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం డివిజన్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కాలె మల్లేష్‌, ఇబ్రహీంపట్నం బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పడాల శంకర్‌గౌడ్‌, యాచారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, నక్కర్తమేడిపల్లి, గడ్లమల్లయ్యగూడ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు గౌర మల్లేష్‌, నాయకులు లక్ష్మయ్యగౌడ్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement