రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు ప్రారంభం

Published Sun, Dec 18 2016 12:11 AM

రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు ప్రారంభం - Sakshi

నెల్లూరు(బృందావనం): స్టోన్‌హౌస్‌పేట తడికలబజార్‌లోని ఆరెస్సార్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల అంతర్‌జిల్లాల సెపక్‌తక్రా అండర్‌ – 14, 17 బాలబాలికల క్రీడాపోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని కాంక్షించారు. అనంతరం డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో ఎలాంటి తప్పిదాలను చేయవద్దని, పొరపాట్లు చేసి జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దని కోరారు. ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల క్రీడాకారులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయని, ఒకే జిల్లా వారిని ఎంపిక చేయడం తగదని హితవు పలికారు. ప్రతిభగల క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేయాలని సూచించారు.
జనవరిలో సెపక్‌తక్రా జాతీయ పోటీలు
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర అండర్‌ – 14, 17 జట్ల ఎంపికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. జనవరిలో జాతీయస్థాయి సీనియర్‌ సెపక్‌తక్రా పోటీలను కడపలో రూ.25 లక్షల వ్యయంతో నిర్వహించనున్నామని వెల్లడించారు. సెపక్‌తక్రా జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు సుందరరావు, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఆరెస్సార్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్‌రావు, బీవీఎస్‌ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌ – 14, 17 ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఇన్‌చార్జి థామస్‌పీటర్, టోర్నమెంట్‌ అబ్జర్వర్‌ అరవ సుకుమార్, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దిలీప్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు
ఎనిమిది జిల్లాల నుంచి క్రీడాకారుల రాక
చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. 
 
 

Advertisement
Advertisement