సర్వర్‌ డౌన్‌ | Sakshi
Sakshi News home page

సర్వర్‌ డౌన్‌

Published Wed, Jan 4 2017 10:48 PM

సర్వర్‌ డౌన్‌ - Sakshi

- ‘కానుక’ల పంపిణీలో జాప్యం
అనంతపురం అర్బన్‌ : జిల్లాలో చౌక దుకాణాల్లోని ఈ-పాస్‌ యంత్రాల సర్వర్‌ డౌన్‌ అవడంతో బుధవారం జిల్లాలోని పలు చౌక దుకాణాల్లో సంక్రాంతి కానుకల పంపిణీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచే సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించినప్పటికీ సర్వర్‌ డౌన్‌ అవుతుండటంతో పంపిణీ ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 11.24 లక్షల మంది బీపీఎల్‌ కార్డుదారులు ఉన్నారు. ఇందులో 22 వేల మంది ఇప్పటికే క్రిస్మస్‌ కానుకలు అందుకున్నారు. మిగిలిన 11.02 లక్షల మందికి సంక్రాంతి కానుకలు అందించాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం బుధవారం నాటికి  కేవలం 79 వేల మంది కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేశారు.

ఎప్పుడొస్తుందో... ఎప్పుడు పోతుందో
సర్వర్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదని పలువురు డీలర్లు చెబుతున్నారు. ఒక గంట సక్రమంగా పని చేస్తుందని, వెంటనే డౌన్‌ అయిపోతుందని, ఎప్పుడు వస్తుందో తెలీక ఈ-పాస్‌ యంత్రాన్ని ముందు పెట్టుకుని కూర్చోవాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతకీ రాకపోతుండటంతో చేసేది లేక మళ్లీ రావాలని లబ్ధిదారులను పంపించి వేస్తున్నామన్నారు. సంక్రాంతి కానుకల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇక్కడ చూస్తే మూడు రోజులుగా సర్వర్‌ సతాయిస్తోందని ఆవేదన చెందుతున్నారు.

వాస్తవమే
సర్వర్‌ డౌన్‌ అవుతున్న మాట వాస్తవమే. జిల్లాకు చెందిన సమస్య అయితే వెంటనే పరిష్కరించి ఉండేవాళ్లం. కాకపోతే హైదరాబాద్‌లోని ప్రధాన సర్వరే డౌన్‌ అవుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృషికి తీసుకెళ్లాము.
- ప్రభాకర్‌రావు, డీఎస్‌ఓ

Advertisement

తప్పక చదవండి

Advertisement