కాశీకి వెళ్లి ఏడుగురి అదృశ్యం | Sakshi
Sakshi News home page

కాశీకి వెళ్లి ఏడుగురి అదృశ్యం

Published Wed, May 4 2016 2:23 AM

కాశీకి వెళ్లి ఏడుగురి అదృశ్యం

♦ తలకు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన మరో యువకుడు పని చేయని సెల్‌ఫోన్లు
♦ 24 గంటల సస్పెన్స్ తర్వాత క్షేమంగా ఉన్నట్లు సమాచారం
 
 బోట్‌క్లబ్ (కాకినాడ)/ కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ఏడుగురు ఆదృశ్యమయ్యారు. తమ వారు ఏమై పోయారోనని వారి బంధువులు తల్లడిల్లిపోయారు. మంగళవారం పొద్దుపోయాక వారు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ గాంధీనగర్ ఎల్విన్‌పేటకు చెందిన డొక్కరి అప్పల నర్సమ్మ (50), డొక్కరి లోవరాజు (27), నమ్మి నారాయణమ్మ (70), గొర్ల మంగమ్మ (50), సర్వసిద్ధి అప్పారావు (75), సర్వసిద్ధి పేరంటాళ్లు (65), నరాల లక్ష్మి (50), బత్తిన మాణిక్యమ్మ (50) గత నెల 29న కాకినాడ నుంచి విజయవాడ మీదుగా రైలులో ఆదివారం కాశీ చేరుకున్నారు.

సోమవారం కాశీ సమీపంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్టు బంధువులకు చెప్పారు. దారిలో ఏం జరిగిందో తెలీదు కానీ, లోవరాజు మినహా మిగతా వారి ఆచూకీ తెలియడం లేదు. లోవరాజు వారణాశిలోని కబీర్‌చోరా ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అక్కడి వైద్యులు ఫోన్లో తెలిపారని బంధువులు చెబుతున్నారు. మిగిలిన ఏడుగురి ఫోన్లు మూగపోవడంతో బంధువుల్లో ఆందోళన మొదలైంది. ‘అసలు వారి ఫోన్లు ఎందుకు పని చేయడం లేదు.. వారికి ఏమైంది.. లోవరాజు సెల్ ఫోన్ రింగవుతున్నా ఎవరూ తీయడం లేదు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతార’ంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

లోవరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లక ముందు వైద్యుని ఫోన్‌తో తమతో మాట్లాడాడని, తనతో ఉన్న వారిని ఎవరో చంపేశారని చెప్పి ఫోన్ పెట్టేశాడన్నారు. వివరాలు సరిగా చెప్పలేదని బంధువులు చెప్పారు. లోవరాజు తలకు గాయంతో ఆస్పత్రికి వచ్చాడని.. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని వైద్యుడు చెప్పారన్నారు. తమ వాళ్లు ప్రమాదానికి గురయ్యారా.. లేక దారి దోపిడీలో ప్రతిఘటించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా.. అనేది అర్థం కావడం లేదని వారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ వద్ద బావురుమన్నారు. అదృశ్యమైన వారి కోసం ఏపీ, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తుండగా.. తాము క్షేమంగానే ఉన్నామని మంగళవారం పొద్దుపోయాక ఆ ఏడుగురు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement