సూసైడ్స్‌ డే | Sakshi
Sakshi News home page

సూసైడ్స్‌ డే

Published Sun, Sep 11 2016 12:30 PM

సూసైడ్స్‌ డే

వరంగల్ జిల్లాలో వేర్వేరు చోట్ల ఏడుగురి బలవన్మరణం 
ఆత్మహత్యల నివారణ దినం రోజే దారుణం 
మృతుల్లో తల్లి, ఇద్దరు పిల్లలు 
 
జీవన సమరంలో వారు ఓడిపోయారు.. మానసిక వేదనతో కలత చెందారు. జీవితానికి ఇక సెలవంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. భర్త తిట్టాడని భార్య, పిల్లలు.. తాను రమ్మన్న రోజు భార్య కాపురానికి రాలేదని ఓ భర్త.. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని ఓ యువ ఇంజనీర్‌.. ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ విషయమై భర్తతో జరిగిన గొడవతో ఓ మహిళ.. ఊళ్లో పెద్దమనుషులు తిట్టి, కొట్టారని ఓ కౌలు రైతు.. కారణాలేమైతేనేమి.. క్షణికావేశం వీరి ప్రాణాలు తీసింది. జీవితంలోని ఒడిదొడుకులు తట్టుకోలేక నిండు జీవితాన్ని వీరు అర్ధాంతరంగా ముగించారు. ఆత్మహత్యలను నివారించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోజే ఏడుగురు బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. 
 
భర్తతో వేగలేక.. పిల్లలకు విషమిచ్చి తనవుచాలించిన తల్లి
వరంగల్‌/న్యూశాయంపేట: కుటుంబ బాధ్యతలు పట్టని భర్తకుతోడు అత్త,మామల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు ఆ ఇల్లాలిని మానసికంగా కుంగదీశాయి. భర్త అనుమానపు చూపులు, సూటిపోటి మాటలతో కలత చెందిన ఆమె తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వరంగల్‌ నగరంలోని న్యూశాయంపేట న్యూమిలీనియం బ్యాంక్‌కాలనీలో శనివారం తెల్లవారుజామున జరిగింది.

మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన అలుగోజు శోభన్‌బాబుకు ములుగు మండల మల్లంపల్లిలోని శ్రీనగర్‌కు చెందిన మడుబోజు బ్రహ్మచారి కుమార్తె ఉమ(42)తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ఉమను అత్తమామలతోపాటు భర్త వేధించేవారు. వీరి కాపురంలో కూతురు విన్మయ(13), కుమారు కౌశిక్‌(11) కలిగారు. స్థానికంగా ఉపాధి దొరకకపోవడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

అక్కడ కూడా పనులు సరిగా దొరకకపోవడంతో వరంగల్‌కు చేరుకొని న్యూశాయంపేట న్యూమిలినీయం కాలనీలో గత నాలుగేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఇక్కడ కూడా భర్తకు పనులు దొరకకపోవడం, అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉమ టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుటుంబ పోషణ నిమిత్తం పనిచేయాలని ఆమె శోభన్‌బాబుపై ఒత్తిడి తీసుకురావడంతో పలుమార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల ఆమె క్రైస్తవ మతం స్వీకరించడం, ప్రార్థనలు చేయాలని కోరడంతో కూడా గొడవలు మరింత ముదిరాయి. 
 
అంతేగాక టైలరింగ్‌ చేసేందుకు వెళ్తున్న ఉమకు వివాహేతర సంబంధం అంటగడుతూ అనుమానంతో తరచూ బ్రహ్మచారి వేధించేవాడని మృతురాలి తండ్రి చెప్పాడు. కుటుంబ పోషణ కోసం తామే బియ్యం, సరుకులు సమకూర్చేవారమని చెప్పాడు. గొడవలు జరుగుతున్న విషయం తెలిసి నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చామని,  తమ అల్లుడు తమ ముందే కూతురిని కొట్డడంతో అడ్డుకునేందుకు వెళ్లాగా తమపై కూడా దాడి చేసి కొట్టాడని, దుర్భాషలాడాడని కన్నీరుమున్నీరయ్యారు. 
 
కుటుంబ పోషణ గురించి ఉమ నిలదీస్తే ‘మీ చావు మీరు చావండి... అవసరమైతే విషం తాగండి’ అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. దీంతో తాము కూతురికి నచ్చజెప్పి రూ.వేయి ఇచ్చి తమ స్వగ్రామానికి వెళ్లామన్నారు. శనివారం ఉదయం తమ కూతురు, పిల్లలు చనిపోయారని తెలియడంతో ఇక్కడకు వచ్చామని బోరున విలపించాడు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసాల సతీష్‌ తెలిపారు. 
 
మృతదేహాల వద్ద సూసైడ్‌ నోట్‌ 
‘నా చావుకు నా పిల్లల చావుకు కారణం నా భర్త, అత్త, మామ. పెళ్లయిన దగ్గరి నుంచి నన్ను హింసించే చంపేశారు. నా భర్త మా అత్త అందరు పచ్చి అబద్ధాలు చెప్పి నమ్మించాలని చూస్తారు. ఆ మాటలు ఎవరు నమ్మకండి. దయచేసి మా అమ్మ, నాన్నకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పెళ్లి అయిన దగ్గర నుంచి నన్ను కొట్టి. తిట్టి ఆయింట్లో అందరు హింసించారు. ఆ బాధలు తట్టుకోలేక ఇంక బతకలేక చనిపోతున్నాను. నా చివరి కోరిక ఒకటి నన్ను నా పిల్లలను చర్చివాళ్లు చెప్పినట్లు సమాధి చేయాలి.’  
 
పోలీసుల అదుపులో భర్త,అత్తమామ
కేసముద్రం: తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కేసముద్రంలో ఉంటున్న వృతురాలి భర్త, అత్తమామను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
 
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని ఏఈ..
కరీమాబాద్‌ : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని మనోవేదనకు గురై ఉరివేసుకుని జెన్‌కో ఏఈ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఫోర్ట్‌రోడ్‌ విద్యానగర్‌లో శనివారం జరిగింది. మిల్స్‌కాలనీ పీఎస్సై సాయన్న కథనం ప్రకారం.. చెల్పూర్‌ జెన్‌కోలో ఏఈగా పనిచేస్తున్న వరంగల్‌ ఫోర్టురోడ్‌లోని గట్టు చందన(25) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమంచిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని, అలాగే తనకు ఇష్టంలేని పెళ్లి సంబంధాలను తల్లిదండ్రులు చూస్తున్నారనే మనోవేదనతో చందన ఆత్మహత్యకు పాల్పడినట్లు పీఎస్సై వివరించారు. మృతురాలి తండ్రి సంజీవ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. 
 
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త..
కాపులకనిపర్తి(సంగెం): పుట్టింటికి వెళ్లిన భార్య తాను రమ్మన్న రోజున రాలేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కాపులకనపర్తిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాపులకనిపర్తికి చెందిన సదిరం రాజు(27)కు ఏడు నెలల క్రితం బచ్చన్నపేట మండలం కేశవపూర్‌కు చెందిన అనితతో వివాహమైంది. అనిత అమ్మమ్మ మరణించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం ఆ వృద్ధురాలి ఐదో రోజు కర్మ జరిగింది.

ఈ క్రమంలో రాజు తన భార్యకు ఫోన్‌ చేసి కాపులకనిపర్తికి రావాలని కోరాడు. అమ్మమ్మ దశదిన కర్మ అయిపోయిన తర్వాత వస్తానని అనిత చెప్పింది. రమ్మనగానే భార్య రాలేదని మనస్తాపం చెందిన రాజు తన రేకులషెడ్‌లో పైపునకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు శవపంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తోట రమేశ్‌బాబు తెలిపారు.
 
పెద్దమనుషులు కొట్టారని కౌలు రైతు..
బేతోలు(మహబూబాబాద్‌ రూరల్‌/కురవి) : నీటితడులు పెట్టే క్రమంలో చోటుచేసుకున్న పంచాయితీలో పెద్దమనుషులు తిట్టి,కొట్టారని మనోవేదనకు గురైన ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కురవి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహబూబాబాద్‌ మండలం బేతోలు గ్రామంలో శనివారం జరిగింది.  మృతుడి భార్య మాంగి, కురవి ఎస్సై టి.అశోక్‌ కథనం ప్రకారం.. బేతోలు శివారు మాన్‌సింగ్‌ తండాకు చెందిన మూడు వీరన్న(37) అదేతండాకు చెందిన భూక్య కౌసల్య వద్ద మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. ఆ భూమిలో వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేశాడు. గత శుక్రవారం(9వతేదీ) పక్క పొలం యజమాని వద్దకు వెళ్లి అతడి బావి నుంచి తన పొలానికి నీళ్లు కావాలని అడిగాడు. అతడు నీళ్లు పెట్టుకునేందుకు ఒప్పుకోవడంతో వీరన్న మోటార్‌ పెట్టేందుకు వెళ్లాడు. అతడు తిరిగొస్తుండగా భూమి యజమానురాలైన భూక్య కౌసల్య సవితి కుమారుడు చిన్న అతడితో గొడవపెట్టుకున్నాడు. నీళ్లు ఎందుకు పెట్టుకున్నావని గొడవకు దిగి వీరన్నను నానా బూతులు తిట్టాడు.
 
అంతేగాక తండాకు వెళ్లి పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టాడు. దీంతో వీరన్నను పెద్దమనుషులైన భూక్య చంద్యా, భాస్కర్‌ పంచాయితీకి పిలిచారు. డిపాజిట్‌గా రూ.5 వేలు పెట్టాలని సూచించారు. అందుకు వీరన్న ఒప్పుకోకపోవడంతో వారు అతడిని దూషించారు. ‘డిపాజిట్‌కు డబ్బులు లేకపోతే ఎందుకురా బతికేది’ అంటూ నానా బూతులు తిట్టి చెప్పుతో కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన వీరన్న ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. భార్య మాంగి అతడిని గమనించి ఇరుగుపొరుగు సాయంతో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పెద్దమనుషులు చంద్యా, భాస్కర్, లొల్లికి దిగిన భూక్య చిన్నపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరన్న మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  
 
ఆత్మహత్యకు దారితీసిన ఫేస్‌బుక్‌ గొడవ
వరంగల్‌ : ఫేస్‌బుక్‌ చాటింగ్‌ కొత్తగా పెళ్లయిన ప్రేమజంటలో చిచ్చుపెట్టింది. చాటింగ్‌ ఎవరితో చేస్తున్నావని భర్తను భార్య ప్రశ్నించడం గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన యువతి భర్త డ్యూటీకి వెళ్లగానే ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వడ్డేపల్లి ఎస్‌బీహెచ్‌ కాలనీ ఎస్‌ఆర్‌ టవర్స్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ నగరంలోని లేబర్‌కాలనీకి చెందిన గద్దల భరత్‌కుమార్‌ నల్లగొండ జిల్లా భువనగిరి కృషి ఐటీఐలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పట్టణంలో డీఎడ్‌ శిక్షణ పొందుతున్న ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలకు చెందిన సంగీత(23)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి కులాలు ఒకటి కాకపోయినా స్నేహితుల మద్దతుతో గత ఏడాది జులై 10న హైదరాబాద్‌లోని అర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. తన తండ్రి మరణాంతరం ఉద్యోగం రావడంతో భరత్‌కుమార్‌ కాజీపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సబ్‌ఇంజనీర్‌గా విధుల్లో చేరాడు. భార్యతో కలిసి ఆయన ఎస్‌బీహెచ్‌ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.

ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఆమోదం తెలపడంతో గత నెల 26వ తేదీన నల్లగొండ జిల్లా వంగపల్లిలోని భరత్‌కుమార్‌ అమ్మమ్మ ఇంట్లో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరుకుటుంబాల బంధువులతోపాటు సంబంధిత శాఖ ఉద్యోగులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తయినందున తాను కూడా ఉద్యోగం చేస్తానని సంగీత భర్తపై ఒత్తిడి తీసుకొస్తే తాను ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, అందువల్ల గృహిణిగా ఉండమని అన్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సంగీత తన భర్త సెల్‌ఫోన్‌ తీసుకొని ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసింది. అందులో భర్త చాటింగ్‌ చేసిన వారి వివరాలు ఆరా తీయగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన సంగీత శనివారం ఉదయం భర్త డ్యూటీకి వెళ్లగానే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అతడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా సంగీత ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది. దీంతో మృతదేహాన్ని కిందికి దింపి స్థానికులను పిలిచాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. సంగీత ఆత్మహత్యకుగల పూర్తికారణాలు తెలియవని కేసు దర్యాప్తు చేస్తున్నామని సుబేదారి సీఐ వాసాల సతీష్‌ తెలిపారు. 

 

Advertisement
Advertisement