డెల్టా గుండెలపై ’షేల్‌’ కుంపటి | Sakshi
Sakshi News home page

డెల్టా గుండెలపై ’షేల్‌’ కుంపటి

Published Sat, Jan 21 2017 10:30 PM

డెల్టా గుండెలపై ’షేల్‌’ కుంపటి

ప్రకంపనలు సృష్టిస్తున్న చమురు, గ్యాస్‌ వెలికితీత నిర్ణయం
 రాతి పొరల నుంచి తీయడం వల్ల పంటలు, పర్యావరణం దెబ్బతింటాయని ఆందోళన
 హైడ్రో ప్రాక్చరింగ్‌ విధానం వల్ల ముప్పు తప్పదంటున్న నిపుణులు
 ఓఎన్‌జీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు భీమవరంలో భారీ సభ
 
భీమవరం :
డెల్టా ప్రాంతంలోని పచ్చటి పొలాలు, గ్రామాల మధ్య రాతి పొరల అడుగున నిక్షిప్తమై ఉన్న చమురు, సహజ వాయు నిక్షేపాలను (షేల్‌ గ్యాస్‌) వెలికి తీయాలనే ఓఎన్‌జీసీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాతి పొరల మధ్య నుంచి హైడ్రో ఫ్రాక్చరింగ్‌ విధానంలో ఈ నిక్షేపాలను వెలికి తీయడం వల్ల పంటలతోపాటు పర్యావరణం దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రజా సంఘాలు ఉద్యమబాట పట్టాయి. నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉ«భయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4,320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో షేల్‌ రాతి పొర విస్తరించి ఉందనేది నిపుణుల అంచనా. ఆ పొర దిగువ నుంచి గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి హైడ్రో ఫ్రాక్చరింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. జిల్లాలోని వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలంలోని కోలనపల్లి గ్రామాల్లో 4 వేల మీటర్ల దిగువన రాతి పొరను తవ్వి నిక్షేపాలను వెలికితీయాలనేది ఓఎన్‌జీసీ ప్రణాళిక. రాతి పొరల దిగువకు గొట్టాలను అమర్చి నీరు, ఇసుక వంటి 700 రకాల రసాయనాలను విపరీతమైన పీడనంతో పంపిస్తారు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అతి ప్రమాదకరమైన మీథేన్‌ వాయువు లీకైతే గ్రామాలు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాతోపాటు జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్, బల్గేరియా, రుమేనియా వంటి దేశాలు షేల్‌ గ్యాస్‌ నిక్షేపాల వెలికితీతను నిషేధించాయి. ఎటువంటి నియంత్రణా విధానాలు లేని మన దేశంలో షేల్‌ గ్యాస్‌  తవ్వకం ప్రమాదాలకు దారితీస్తుందనేది నిపుణుల వాదన. ఇప్పటికే పరిశ్రమల కారణంగా డెల్టా ప్రాంతం కాలుష్యం బారినపడి ప్రమాదకర స్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో షేల్‌ గ్యాస్‌ వెలికితీత కార్యకలాపాలు చేపడితే ఈ ప్రాంతంలోని పంటలు, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
8 నెలల క్రితమే రంగం సిద్ధం
షేల్‌ గ్యాస్‌ వెలికితీసేందుకు నిర్ణయించిన ఓఎన్జీసీ ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజా సంఘాల వాదన. వెలికితీత చేపట్టే గ్రామాల్లోని ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ఇదిలావుంటే.. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో షేల్‌ గ్యాస్‌ వెలికితీసేందుకు ఓఎన్జీసీ అధికారులు 8 నెలల క్రితమే రంగం సిద్ధం చేశారు. అండలూరులో బోరుబావి తవ్వడానికి అనుకూలంగా కాంక్రీటుతో దిమ్మెలు నిర్మించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. ఈ ప్రాజెక్ట్‌ విషయమై గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 
 
నేడు మూడు జిల్లాల సదస్సు
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో  చేపట్టే షేల్‌ గ్యాస్‌ వెలికితీత కార్యకలాపాలపై ఆదివారం భీమవరంలో మూడు జిల్లాల స్థాయిలో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌లో భీమవరంలో విస్తృతమైన పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా షేల్‌ గ్యాస్‌ వెలికితీతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సీపీఐ ఆధ్వర్యంలో షేల్‌గ్యాస్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా భీమవరం సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం నియోజకవర్గాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు. డెల్టా గుండెలపై ’షేల్‌’ కుంపటి రగిల్చేందుకు సాగుతున్న ఏర్పాట్లపై ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపట్టేందుకు ప్రజా సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
 

 
Advertisement
 
Advertisement