బ్లాక్ టికెట్లు అమ్ముకుని.. ఎంపీ అయ్యారు! | Sakshi
Sakshi News home page

బ్లాక్ టికెట్లు అమ్ముకుని.. ఎంపీ అయ్యారు!

Published Mon, Jul 4 2016 6:06 PM

బ్లాక్ టికెట్లు అమ్ముకుని.. ఎంపీ అయ్యారు!

విజయవాడ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సుల టికెట్లను బ్లాక్లో అమ్ముకుని కేశినేని నాని సంపద కూడగట్టుకున్నారని, దాంతోనే ఆయన ఎంపీ అయ్యారని విజయవాడకు చెందిన శివస్వామి మండిపడ్డారు. జీవితంలో ఇక ఎన్నడూ నాని గెలిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు.

తనకు నిన్నటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తు‍న్నాయని, విజయవాడ వీధుల్లో ఎలా తిరుగుతావో చూస్తామని అంటున్నారని.. తాను ప్రాణత్యాగానికి సైతం ఎప్పుడో సిద్ధమని చెప్పారు. తనను దొంగ స్వామి అంటూ నాని పిచ్చి తుగ్లక్లా మాట్లాడుతున్నారని, ఆలయ నిర్మాణాలలో తాను వెనకేసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారని, అవన్నీ నిరాధారమని చెప్పారు. తన పూర్వీకులు స్వాతంత్ర్య సమర యోధులైనా, విజయవాడలో ఎక్కడా ఒక్క గజం స్థలం కూడా తీసుకోలేదని.. అలాగే తన బ్యాంకు ఖాతాలో కూడా ఎప్పుడూ 3వేల రూపాయలకు మించి ఉండవని.. అలాంటిది తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ ద్వారపాలకుడిని తీసేశారని, ఇది అత్యంత దారుణమని చెప్పారు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాలు గాయపరిచారని, తమ గుండెలు బద్దలయ్యాయని అన్నారు. మసీదు తొలగించడానికి 4 నెలల సమయం ఇచ్చారు.. హిందూ దేవాలయానికి 4 రోజులు కూడా ఇవ్వలేదని.. కేవలం ఒక్కరోజు సమయమే ఇచ్చారని చెప్పారు. మన సీఎం, మన పాలకులు అని చెప్పుకొంటున్నాం.. గానీ కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్లు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ఠ చేసిన ఆలయాలను దారుణంగా కూల్చేశారని అన్నారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా ఆలయాలను కూల్చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారని... కానీ అక్కడ దానికి ముందుగానే స్థానిక పీఠాధిపతుల నుంచి మఠాధిపతులు, ఇతరులు అందరినీ పిలిపించి, వాళ్లతో చర్చించారని.. శాస్త్రోక్తంగా తొలగింపు పనులు చేపట్టడంతో పాటు వేరేచోట ఆలయనిర్మాణానికి భూమి, నిధులు అన్నీ ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా, ముందుగా ఆలయ వర్గాలనే గోడ కూల్చివేత మొదలుపెట్టమని చెప్పి.. ఆ తర్వాత వాళ్ల ఆధ్వర్యంలోనే ఆలయ తొలగింపు పనులు చేపట్టారని, ఇక్కడ మాత్రం మంచీ చెడూ చూడకుండా రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా ఆలయాలు కూల్చేసి విగ్రహాలను మునిసిపల్ ఆఫీసులలో పారేశారని మండిపడ్డారు.

ఆలయాలతో ఆలయాలతో వ్యాపారాలు చేశామా..
ఆలయాల పేరుతో వ్యాపారం చేస్తున్నామని  కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని.. ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడానికి ముందుగా మీరు ఆలయానికి వెళ్లి ఆ పత్రాలతో పూజలు చేయించడం లేదా.. అది వ్యాపార ప్రయోజనం అనిపించలేదా అని శివస్వామి ఘాటుగా ప్రశ్నించారు. ఆ మంత్రి తక్షణమే సాధుపరిషత్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement