శివా టెక్కు! | Sakshi
Sakshi News home page

శివా టెక్కు!

Published Sat, Oct 8 2016 10:52 PM

శివా టెక్కు! - Sakshi

అగ్నిమాపక శాఖ అనుమతి లేని ఫ్యాక్టరీ
- భారీ అగ్నిప్రమాదంతో వెలుగులోకి..
- దట్టమైన పొగలతో కర్నూలు ఉక్కిరిబిక్కిరి
– ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న డాక్టర్లు
– నష్టం అంచనా రూ.4 కోట్లు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగల వెనుక చీకటి కోణం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీ రాయలసీమ ఆల్కాలీస్‌ అండ్‌ అల్లైడ్‌ కెమికల్స్‌(ఎస్‌ఆర్‌ఏఏసీఎల్‌)కు సమీపంలోని శివటెక్‌ ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ తయారీ యూనిటైన ఈ శివటెక్‌ ఇండస్ట్రీస్‌ కనీసం అగ్నిమాపకశాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలు సదరు కంపెనీలో లేవు. ఈ కారణంగా మంటలు వ్యాపించి వెంటనే అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. ఎంతో విషతుల్యమైన ఈ రసాయనాల కంపెనీకే అగ్నిమాపకశాఖ అనుమతి లేదంటే.. ఇక మిగిలిన కంపెనీల పరిస్థితి ఏమిటో తలచుకుంటేనే గుండెల్లో దడ పుడుతోంది. మొత్తం మీద శివటెక్‌ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంతో సదరు కంపెనీకి సుమారు రూ.4 కోట్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే, అంతకుమించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
ఆరేళ్లుగా వ్యాపారం
శివ గ్రూపునకు చెందిన శివటెక్‌ ఇండస్ట్రీ.. ఎస్‌ఆర్‌ఏఏసీఎల్‌కు చెందిన 2.5 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది. గొందిపర్ల గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్‌ 62/ఏ, పార్ట్‌–2లో రబ్బరు, ప్లాస్టిక్, పెయింట్స్‌లో ఉపయోగించే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌(క్లోరినేటెడ్‌ పారాఫిన్స్‌ వ్యాక్స్‌) తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ఈ కంపెనీ కోటి రూపాయల అధీకృత మూలధనంతో 23 మార్చి 2009లో శివటెక్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్లాంటులో నవంబర్‌ 2011లో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అంటే సుమారు ఆరేళ్లుగా వ్యాపారం చేస్తోంది. రూ.95 లక్షల పెయిడప్‌ కేపిటల్‌గా ఉన్న ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కసీస్‌ నెన్వానీ, శివకుమార్‌ నెన్వానీ, అమిత్‌ నెన్వానీలు వ్యవహరిస్తున్నారు. అయితే, కనీసం ఫైర్‌ అనుమతి తీసుకోకుండానే ప్రమాదకరమైన రసాయనాలతో కంపెనీ ఎలా నడుస్తుందో అర్థంకాని పరిస్థితి. ఏదైనా స్కూలు, కాలేజీ పెట్టాలంటేనే కచ్చితంగా అగ్నిమాపకశాఖ(ఫైర్‌ డిపార్టుమెంట్‌) నుంచి అనుమత తీసుకోవాలనే నిబంధన ఉంది. అలాంటిది అగ్నిమాపకశాఖ అనుమతి లేకుండానే కంపెనీ నడిపిస్తున్నారంటే.. మిగిలిన పరిశ్రమల పరిస్థితి తలచుకుంటేనే భయాందోళన నెలకొంటోంది.
 
ఆరోగ్యంపై పెనుప్రభావం
వాస్తవానికి ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నుంచి సీఎఫ్‌ఓ అనుమతి తీసుకుంది. అగ్నిప్రమాదం నేపథ్యంతో తలెత్తిన మంటలతో ఎంత మేర కాలుష్యం వ్యాపించిందనే విషయం లెక్కగట్టేందుకు పీసీబీ సిబ్బంది కూడా అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. వీవోసీ అనలైజర్‌ ద్వారా కాలుష్యాన్ని లెక్కగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కలు తెలితే దాని ప్రభావం ఇంకా ఎంత ఉంటుందనే అంశం తేలనుందని వైద్యనిపుణులు అంటున్నారు. క్లోరినేటెడ్‌ పారాఫిన్స్‌ వ్యాక్స్‌ తయారీ అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో లీకు కాకుండా చూసుకోవాలి. అయితే, ఇక్కడ కాస్తా అగ్నిప్రమాదం జరగడంతో...ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కళ్లు మండటంతో పాటు చర్మ వ్యాధులకూ దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తలెత్తిన ఈ ప్రమాదం భారీగా ఉన్న నేపథ్యంలో కేవలం కళ్లు, చర్మ వ్యాధులతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులూ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 
 

Advertisement
Advertisement