పోటెత్తిన జనం | Sakshi
Sakshi News home page

పోటెత్తిన జనం

Published Wed, Mar 1 2017 9:39 PM

పోటెత్తిన జనం

- కనుల పండువగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం
- స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు


అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన పెద్ద రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మడకశిర, హిందూపురం, కర్ణాటక ప్రాంతాలు చెళ్లికెర, హరియూర్, శిర, తుమకూరు, మైసూర్, బెంగళూరు, మండ్య తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు.

అనంతరం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా వివిధ రకాల పూలమాలలతో అలంకరించి బ్రహ్మరథోత్సవం వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి వేదమంత్రోచ్చారణల మధ్య రథోత్సవంలో కూర్చోబెట్టారు. అశేష భక్త జన సమూహం మధ్య ఓం నమఃశివాయా.. సిద్ధేశ్వరస్వామి మహరాజ్‌కీ జై.. శివ.. శివహర శంభో అంటూ శివనామస్మరణలతో భక్తులు రథోత్సవాన్ని ముందుకు లాగారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో హేమావతి గ్రామం జనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు బిజీబిజీగా మారాయి.

Advertisement
Advertisement