సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ! | Sakshi
Sakshi News home page

సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ!

Published Sat, May 7 2016 2:44 AM

సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ!

మున్సిపాలిటీని ఎంపిక చేసిన కేంద్రం
సమగ్రాభివృద్ధికి కొత్త ప్రణాళిక
అన్ని వర్గాలచే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నివేదిక

 సిద్దిపేట జోన్: వినూత్న పథకాలు, ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. శానిటేషన్‌ను ఆధారంగా పట్టణాన్ని సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఐదు కార్పొరేషన్లను, ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. జిల్లా నుంచి సిద్దిపేటకు అవకాశం దక్కడం విశేషం. శానిటేషన్ టాస్క్‌ఫోర్స్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు శుక్రవారం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ముఖ్యులుగా పట్టణంలోని విభిన్న వర్గాలకు చెందిన 30 మందితో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి తొలిసమావేశం నిర్వహించారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఇటీవల కేంద్రం తెలంగాణలోని 64 మున్సిపాలిటీల్లో లక్ష జనాబా ప్రతిపాదికను ప్రమాణికంగా తీసుకుని ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. వాటిలో సిద్దిపేటకు అవకాశం దక్కింది. ఇప్పటికే పట్టణంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న సిద్దిపేట.. ఇంటింటికి తడి, పొడి చెత్తసేకరణతో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పట్టణంలో కంపోస్ట్ యార్డు, డంప్‌యార్డుతో పాటు తడిపొడి చెత్త  సేకరణ ఐటీసీ హబ్‌లాంటి వినూత్న ప్రయోగాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే శానిటేషన్‌ను వందశాతం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా విడుదలవుతున్న నిధుల వివరాలను, వాటి వినియోగాన్ని నివేదిక రూపంలో అందించాలని ఆదేశాలు జారీ చేసింది.  భవిష్యత్తు ప్రణాళికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం అడుగు ముందుకేసింది. చైర్మన్, కమిషనర్ నేతృత్వంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖకు చెందిన అధికారులచే టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆయా వార్డుల్లో ప్రజల ఆవసరాలను, మున్సిపల్ పరంగా చేపట్టాల్సిన గురుతర భాద్యతను సలహసూచనల రూపంలో టాస్క్‌ఫోర్సు నివేదిక రూపొందించాల్సి ఉంది.

ముఖ్యంగా శానిటేషన్, నీటి సరఫరాపై ఇప్పటికే సఫలీకృత బాటలో ఉన్న మున్సిపల్‌కు కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద సీవరేజి ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులను కూడా కేటాయించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే సిద్దిపేట పట్టణం స్మార్ట్‌సీటితో పాటు క్లిన్‌సిటీగా మారడం ఖాయం ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళిక కోసం మున్సిపల్ అధికారులు రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన నివేదికను అందించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement