ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌ల యాక్టివేషన్‌ | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌ల యాక్టివేషన్‌

Published Wed, Jul 20 2016 9:34 PM

ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌ల యాక్టివేషన్‌ - Sakshi

 
  • ముఠా గుట్టురట్టు
నెల్లూరు (క్రైమ్‌) :
ఫోర్జరీ డాక్యుమెంట్లతో యాక్టివేషన్‌ చేసిన (ప్రీయాక్టివేటెడ్‌) సిమ్‌కార్డులను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నాల్గోనగర పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నగర డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని ఏసీనగర్‌కు చెందిన బాలాజీకుమార్, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన పెంచలయ్య స్నేహితులు. వీరు మూడు నెలలుగా హరనాథపురంలో గిరి మెడికల్‌ షాపు సమీపంలో వోడాఫోన్‌ అవుట్‌లెట్‌ నిర్వహిస్తూ ఆ కంపెనీ సిమ్‌లను విక్రయిస్తున్నారు. సిమ్‌కోసం వచ్చే వినియోగదారులనుంచి ఫొటోగుర్తింపు, ధ్రువపత్రాలను తీసుకుని వాటి ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వోడాఫోన్‌ సీఎస్‌ఎం అండ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్‌ జి. రాజశేఖర్‌ సహాయంతో ఫోర్జరీ ధువపత్రాలతో సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేసి ఒక్కో సిమ్‌ రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌ల విక్రయాలపై నాల్గోనగర ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య కొంతకాలంగా నిఘా ఉంచారు. బుధవారం సీతారామయ్య ఆధ్వర్యంలో నాల్గోనగర ఎస్‌ఐలు ఎస్‌కే అలీసాహెబ్, ఎం రఘునాథ్‌ తమ సిబ్బందితో కలిసి వొడాఫోను అవుట్‌లెట్‌పై దాడి చేశారు. యాక్టివేషన్‌ చేసిన వొడాఫోన్‌ సిమ్‌కార్డులు 10, యాక్టివేషన్‌ కానివి 99, ఖాళీ దరఖాస్తులు 29, రెండు కార్బన్‌ సెల్‌ఫోన్లు, రూ. వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవుట్‌లెట్‌ నిర్వహిస్తున్న బాలాజీకుమార్, పెంచలయ్యతో పాటు వోడాఫోన్‌ సీఎస్‌ఎం అండ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్‌ రాజశేఖర్‌ను అరెస్ట్‌చేశారు. 
రోడ్లపై సిమ్‌లు కొనుగోలు చేయవద్దు 
రోడ్లపై ఏర్పాటు చేసిన అవుట్‌లెట్‌ల్లో సిమ్‌లు సాధ్యమైనంత మేర కొనుగోలు చేయవద్దని నగర డీఎస్పీ సూచించారు. అవుట్‌లెట్‌ నిర్వాహకులు అనేక మంది డబ్బులకు ఆశపడి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సిమ్‌కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులు ఇచ్చిన ధృవపత్రాలను ఫోర్జరీ చేసి ఇతర సిమ్‌లను వాటి ద్వారా యాక్టివేట్‌ చేసి విక్రయిస్తోన్నారని చెప్పారు. దీని వల్లన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆధీకృత కంపెనీ డీలర్ల వద్దనే సిమలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.ఫోర్జరీ డాక్యుమెంట్‌లతో సిమ్‌లను యాక్టివేట్‌ చేసి విక్రయించి జేబులు నింపుకుంటున్న ముఠాలపై నిఘా ఉంచామన్నారు.  
సిబ్బందికి అభినందన 
సిమ్‌ మాఫియా గుట్టురట్టు చేసిన నాల్గోనగర ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, ఎస్‌ఐలు ఎస్‌కే అలీసాహెబ్, ఎం. రఘునాథ్‌ సిబ్బంది పోలయ్య, సురేష్, శివకృష్ణ, మహేంద్రనాథ్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement