పాలకులకు పట్టని ‘శింగనమల’ | Sakshi
Sakshi News home page

పాలకులకు పట్టని ‘శింగనమల’

Published Wed, May 24 2017 11:32 PM

పాలకులకు పట్టని ‘శింగనమల’

అభివృద్ధికి ఆమడ దూరం
తాగు, సాగు నీటికీ కటకటే
ప్రజా సమస్యలపై రేపటి నుంచి ‘మేలుకొలుపు’
రైతుల్లో మనోధైర్యం నింపేందుకు జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర


తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో శింగనమల నియోజకవర్గ ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. సాగునీరు లేక ఆయకట్టు భూములన్నీ బీళ్లుగా మారాయి. వేసవిలో దాహంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతులకు పంట నష్ట పరిహారం అందకపోవడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఎక్కడికక్కడ బోరుబావులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ పథకాలేవీ అర్హుల దరి చేరడం లేదు. బిల్లలు అందక ఉపాధి కూలీలు వేసారిపోతున్నారు. పక్కా గృహ నిర్మాణాల కోసం పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు  ఇవన్నీ ప్రభుత్వ విప్‌ యామనీబాల ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ ప్రజల వెతలు.
- శింగనమల

80 వేల ఆయకట్టు బీడే
శింగనమల నియోజకవర్గంలో హెచ్చెల్సీ పరిధిలో 80 వేల ఆయకట్టు ఉంది. కొన్నేళ్లుగా హెచ్చెల్సీకి నీరు వదలక పోవడంతో ఆ భూములన్నీ బీళ్లుగా మారాయి. ఒక్కప్పుడు పది మందికి అన్నం పెట్టిన ఆయకట్టు రైతులు.. నేడు కూలీలుగా మారారు. ఉన్న ఊరిలో పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్నారు.

చెరువులకు అందని నీరు
జిల్లాలోనే అతి పెద్ద చెరువుల్లో ఒక్కటైన శింగనమల చెరువుకు నీటి విడుదల కలగానే మారింది. ఈ చెరువు కింద ఆరు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ చెరువును లోకలైజేషన్‌ చేస్తామంటూ హామీలిస్తున్న రాజకీయ నాయకులు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఊసే మరిచిపోతున్నారు. ఫలితంగా ఇది ఓటు బ్యాంక్‌ చెరువుగా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా యామినీబాల బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలో చెరువుకు నీటిని విడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు.  దీంతో చెరువు లోతట్టు ప్రాంతంలో కంపచెట్లు పెరిగిపోయాయి. నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు చెరువులకూ అరకొరగానే నీటిని వదిలారు. మిగిలిన మండలాల్లోని ఏ ఒక్క చెరువునూ నీటితో నింపలేకపోయారు.

అవినీతికి పరాకాష్ట..
శింగనమల పరిధిలోని ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతల అవినీతి దందా నేటికీ కొనసాగుతూ ఉంది. ఎలాంటి అనుమతులు లేకున్నా.. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఉల్లికల్లు ప్రాంతం నుంచి రూ. కోట్లలోనే ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అంచనా. యథేచ్ఛగా ఇసుక తరలిస్తుండడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. గతంలో పదుల అడుగుల్లో నీరు లభ్యమయ్యే ఈప్రాంతంలో నేడు వందల అడుగుల లోతున తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. ఆఖరుకు తాగునీటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

తీరని తాగునీటి ఇక్కట్లు
శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం మండలాల్లో 116 పంచాయతీలున్నాయి. ఇందులో అత్యధిక పంచాయతీల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్ల నీరు ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉన్న చేతి పంపులను మరమ్మతు చేయించడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోంది.

నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు..
– మిడ్‌ పెన్నార్‌ డ్యాం ఆయకట్టుకు నీటి విడుదలలో విఫలం. మూడేళ్లుగా ఎంపీఆర్‌ డ్యాం పరిధిలో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– శింగనమల, బుక్కరాయసముద్రం,  సలకంచెరువు  గ్రామాల్లోని చెరువులకు నీటిని విడిపించడంలో వైఫల్యం.
– ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం.  నీరు–చెట్టు పేరుతో కూలీలకు పనులు కల్పంచకుండా జేసీబీలతో చేయించి నిధులు దోచుకున్నారు.
– ఇసుక అక్రమ రవాణాతో దోపీడి.
– అర్హులకు అందని సామాజిక పింఛన్లు. మంజూరు కాని పక్కా గృహ నిర్మాణాలు.
– పంట నష్టపరిహారం, బీమా మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు. ఫలితంగా ఏడాది ప్రశ్నార్థకం కానున్న ఖరీఫ్‌ పంట సాగు.
– గ్రామాల్లో తీరని తాగునీటి సమస్యలు.

ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట
ప్రభుత్వ వైఫల్యాలపై వెస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పోరుబాట పట్టనున్నారు. మేలుకొలుపు పేరుతో ప్రజా సమస్యలను గుర్తించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఆమె పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నెరవేరని ప్రభుత్వ హామీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వరుస పంట నష్టాలతో ఆత్మస్తైర్యం కోల్పోయిన అన్నదాతల్లో మనోధైర్యం పెంచనున్నారు. ఇందులో భాగం‍గా శుక్రవారం యల్లనూరు మండలం నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది.

పాదయాత్ర షెడ్యూల్‌ ఇలా..
- 26న యల్లనూరులో ప్రారంభమై కోడుమూర్తి, చిలమకూరు మీదుగా రాత్రికి అచ్చుతాపురం చేరుకుంటారు.
- 27న అచ్యుతాపురం నుంచి ప్రారంభమై వాసాపురం క్రాస్‌, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండగారికుంట, కొత్తపల్లి, రంగరాజుకుంట క్రాస్‌, కుమ్మనమల, చాలవేముల క్రాస్‌ మీదుగా రాత్రికి మడ్డిపల్లి చేరుకుంటారు.
- 28న మడ్డిపల్లి నుంచి ప్రారంభమై జంగంరెడ్డి పేట, మడుగుపల్లి వరకు కొనసాగుతుంది.
- 29న నార్పల మండలంలోని మూగేతిమ్మంపల్లి క్రాస్, నరసాపురం క్రాస్,  సుల్తాన్‌పేట, నార్పల, బీకేఎస్‌ మండలంలోని బొమ్మలాటపల్లి వరకు సాగుతుంది.
30న బొమ్మలాటపల్లి, చెన్నంపల్లి క్రాస్, వెంకటాపురం, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు.
31న కొర్రపాడు, శింగనమల మండలం మరువకొమ్మక్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట కాలనీ, సోదనపల్లిక్రాస్, పెద్దమట్లుగొంది, ఈస్ట్‌ నరసాపురం క్రాస్, చిన్నమట్లగొంది క్రాస్, సలకంచెరువు వరకు కొనసాగుతుంది.
జూన్‌ 1న సలకంచెరువు, నాయనవారిపల్లి క్రాస్, రాచేపల్లి క్రాస్, నిదనవాడ, తరిమెల.
2న తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి క్రాస్, గార్లదిన్నె మండలం ఇల్లూరు, పాత కల్లూరు, కల్లూరు.
3న కల్లూరు, ఎగువపల్లి క్రాస్, రామదాస్‌పేట క్రాస్, కనుంపల్లి క్రాస్‌, గుడ్డాలపల్లి, సిరివరం, క్రిష్ణాపురం, బూదేడు.
4న బూదేడు, మర్తాడు, గార్లదిన్నె. యాత్ర ముగింపు సందర్భంగా ఇదే రోజు సాయంత్రం మూడు గంటలకు గార్లదిన్నెలో భారీ బహిరంగ సభ జరగనుంది.q

Advertisement
Advertisement