సింగపూర్ సంస్థలకే సర్వాధికారాలు | Sakshi
Sakshi News home page

సింగపూర్ సంస్థలకే సర్వాధికారాలు

Published Tue, Dec 22 2015 2:20 AM

సింగపూర్ సంస్థలకే సర్వాధికారాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి భూములపై సింగపూర్ సంస్థలకు సర్వాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన రాయితీల రేట్లపై అన్నీ సమకూర్చేందుకు చేసిన మార్పులకు శాసనసభ ఆమోదం తెపింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా, సమగ్ర చర్చకు ఎంతమాత్రం అవకాశమే ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఎనిమిది కీలకమైన బిల్లులను ఆమోదించింది. ఇందులో  రెండు  అప్పటికప్పుడే ప్రవేశపెట్టి, ఆమోదముద్ర వేయడం విశేషం. వాటిలో మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి సవరణ, విద్యుత్ సుంకం , నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారిటైమ్ బోర్డు , విదేశీ మద్యం సవరణ , వ్యాట్ ఆధారిత పన్ను సవరణ , మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ బిల్లులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి బిల్లును కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతూ... రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చే భూముల లీజును 33 ఏళ్ళ నుంచి 99 ఏళ్లకు పెంచినట్టు తెలిపారు. తక్కువ సమయం లీజు కారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా లేవని, ఈ కారణంగా పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని సవరణ  ఉద్దేశాలను వివరించారు.

 మనీల్యాండరింగ్ బిల్లు...: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో  మనీ ల్యాండరింగ్ బిల్లుకు సభలో ఆమోదం తెలిపారు. దీన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడుతూ... వడ్డీ వ్యాపారానికి లెసైన్సులు తప్పనిసరి చేస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీకన్నా ఎక్కువ వసూలు చేస్తే ఏడాది వరకూ జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించే అధికారం కల్పించామని చెప్పారు. ప్రతీ వడ్డీ వ్యాపారి ఏటా అకౌంట్ పుస్తకాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కూన రవికుమార్, శ్రీరాం తాతయ్య, బుచ్చయ్య చౌదరి అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.

 ప్రైవేటు యూనివర్సిటీలు బార్లా
 రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యులు అనేక అనుమానాలు లేవనెత్తారు. ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉందని స్వపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  విద్యుత్ వినియోగదారులపై సుంకం భారం మోపుతూ  అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల యూనిట్‌కు రూ. 6 పైసల చొప్పున వసూలు చేస్తారు. తీర ప్రాంతంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇస్తూ ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు సంబంధించిన బిల్లును సభ ఆమోదించింది. వ్యాట్‌కు సవరణలు చేస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.వీటి ఆమోదం తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు.

Advertisement
Advertisement