పరిమళించిన మానవత్వం | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం

Published Sun, Aug 28 2016 8:17 AM

పరిమళించిన మానవత్వం - Sakshi

* చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్ల దాతృత్వం
* సోదరి వివాహానికి ఇవ్వాల్సిన కానుక బాధితురాలి చికిత్సకు..


ధర్మపురి: మానవత్వం పరిమళించింది. తన సోదరి వివాహం సందర్భంగా కానుకగా సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.15వేలను కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స కోసం అందించి స్ఫూర్తిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అనిత, శృతి అనే అక్కాచెల్లెళ్లు. వీరు అమెరికాలో ఎంఎస్ చదువుతున్నారు. వీరి పెద్దక్క డాక్టర్ సంధ్య వివాహం శనివారం తిరుపతిలో జరిగింది.

ఈ సందర్భంగా రూ.15వేల విలువైన బంగారు గొలుసు కానుకగా ఇచ్చేందుకు వీరు సిద్ధమయ్యూరు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అందులోని ఓ పోస్టును చూసి ఆశ్చర్యపోయారు. తమ సోదరికి ఇవ్వాలనుకున్న కానుకను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేద మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
 
ఆమె అభాగ్యురాలు..
కరీంనగర్ జిల్లా ధర్మపురి న్యూ ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని అంజవ్వ తండ్రిచిన్నతనంలో మృతి చెందాడు. తల్లి నర్సమ్మ వృద్ధురాలు. అంజవ్వకు వివాహమైన ఏడాదిలోపే భర్తతో విడాకులు అయ్యాయి. ఆమె కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యం చేయించుకునే ఆర్థికస్తోమత లేకపోవడంతో చలించిన స్థానికుడైన రేణికుంట రమేష్.. వైద్య సాయం కోసం దాతలు స్పందించాలని గత గురువారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఈ పోస్టును పరిశీలించిన అక్కాచెల్లెళ్లు అనిత, శృతిలు తన పెద్దక్క వివాహం కోసం కానుకగా ఇచ్చే రూ.15వేలను బాధితురాలి వైద్య సాయం కోసం పంపించారు. ఈ సందర్భంగా అనిత, శృతి మాట్లాడుతూ వివాహం కోసం కానుకలు ఎప్పుడైనా ఇవ్వొచ్చని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మిన్న అన్నారు. అభాగ్యురాలైన అంజవ్వ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Advertisement
Advertisement