విషాద గీతిక | Sakshi
Sakshi News home page

విషాద గీతిక

Published Fri, Sep 15 2017 7:32 PM

విషాద గీతిక - Sakshi

శుభకార్యానికివచ్చి వెళుతుండగా దుర్ఘటన
డ్రైవర్‌ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
విగతజీవులైన ముగ్గురు తోడికోడళ్లు
స్థానికుల సహాయంతో ముగ్గురు సురక్షితం...
మృతులంతా కృష్ణాజిల్లా వాసులు


దెందులూరు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
వేర్వేరు కుటుంబాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో పుట్టిన ఆ మహిళలు ఒకే కుటుంబంలోని అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు. వివాహ బంధంతో దేవుడిచ్చిన అక్కాచెల్లెళ్లుగా అన్యోన్యంగా జీవితాలు సాగిస్తున్నారు. గ్రామమంతా వారిని చూసి ముచ్చట పడేది. సొంత అక్కాచెల్లెళ్లు కూడా ఇంత ఆప్యాయంగా ఉండరని.. ఎటువంటి అరమరికలూ లేకుండా వారు సంసారాలు చేస్తుండడం గ్రామస్తులకు ఆదర్శంగా ఉండేది. ఏ శుభకార్యాలకు ఎక్కడకు వెళ్లినా వారంతా కలిసి వెళ్లేవారు. వారున్న చోట ఆనందం సందడి చేసేది. వారి అన్యోన్యతను చూసి దేవుడికి కళ్లుకుట్టాయో ఏమో! లేక వారిని తమ వద్దకు తెచ్చుకుంటే తమ లోకానికి కూడా వారు ఆదర్శంగా ఉంటారనే ఆలోచనో ఏమో! మొత్తానికి వారిని తమ వద్దకు చేర్చుకున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో అందరినీ ఒకేసారి తీసుకువెళ్లిపోయాడు. ఈ లోకంలో ఒక్కటిగా, ఒకేమాటపై ఉన్న ఆ తోడి కోడళ్లు ఒకరిని ఒకరు ఒదిలి ఉండలేక పరలోకానికి కూడా తోడుగానే వెళ్లిపోయారు. వారితో పాటు వారి పెదమామగారి కోడలు, వారిలో ఒకరి కోడలు, మనుమరాలు కూడా వారిని అనుసరించారు.

దెందులూరు మండలం కొవ్వలి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కార్పియో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి మృత్యువాత పడడం జిల్లా వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తరచూ ప్రమాదాలు జరగడం, ఆయా ప్రమాదాల్లో ఒకరో ఇద్దరో చనిపోవడం జిల్లా వాసులకు అనుభవమే అయినా ఇటువంటి విషాదకర వార్త వినా ల్సిరావడం వారి హృదయాలను ద్రవింప చేసింది. పుష్పాలంకరణ వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణమైన ఐదు నిమిషాల్లోనే వారంతా విగత జీవులవడం పెను విషాదాన్ని మిగిల్చింది.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది (డ్రైవర్‌తో కలిపి 9) ఎరుపు రంగు స్కార్పియో వాహనంలో గురువారం ఉదయం బయలుదేరి కొవ్వలి గ్రామం సమీపంలోని కొమ్మనివారితోటలో నక్కా వాసు (బాబి) ఇంట్లో పుష్పాలంకరణ వేడుకలో శుభకార్యానికి హాజరయ్యారు. వీరంతా వేడుకల్లో ఉండగా కారు డ్రైవర్‌ మద్యం సేవించాడు. భోజనాలు చేసిన అనంతరం కారులో అంతా కలిసి తమ స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలో కొవ్వలి గ్రామం దాటి మరికొద్దిసేపట్లో హైవే ఎక్కుతామనుకునే లోపు మద్యం మత్తులో వున్న డ్రైవర్‌ నిర్లక్ష్యంగా కారు నడపడంతో కొవ్వలి గ్రామ శివారులో ఉన్న శ్మశాన వాటిక పక్కన డంపింగ్‌యార్డు గుంతలోకి కారు అదుపుతప్పి దూసుకువెళ్లింది.

ఈ గుంతలో ఊబి ఉండడంతో అందులోకి దూసుకువెళ్లిన కారు కూరుకుపోయింది. ఈ దుర్ఘటనలో తోటి కోడళ్లు చిన్నాల సులో చన (62), చిన్నాల లక్ష్మీ నాంచారమ్మ (60), చిన్నాల శివకుమారి (50),  చిన్నాల విజయ (47), ఆమె కోడలు లక్ష్మీ వల్లిదేవి (25), మనుమరాలు తాన్యశ్రీ (2) అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న లక్ష్మీ వల్లిదేవి కుమారుడు షణ్ముఖ్‌ (5), కూనపరెడ్డి వరలక్ష్మి, కారు డ్రైవర్‌ కిరణ్‌ ప్రాణాలతో బయటపడ్డారు.

స్థానికులు స్పందించినా దక్కని ప్రాణాలు..
ప్రమాద ఘటన జరిగిన రోడ్డు నిత్యం రద్దీగానే ఉండడం, ఘటనా ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఒక రైస్‌ మిల్లు, మరో పక్క చేపల చెరువు ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే పరుగులు పెట్టి అక్కడికి చేరుకున్న స్థానికులు ఊబిలో కూరుకుపోయిన కారును బయటకు లాగే పరిస్థితి కనిపించకపోవడంతో కనీసం కారులో ఉన్నవారినైనా బతికించాలనే ఆశతో కారు వెనుక ఉన్న అద్దాన్ని పగులగొట్టి అందులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. దురదృష్టవశాత్తూ వారిలో ఆరుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోవడం వారిని విచారంలోకి నెట్టేసింది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో డ్రైవర్‌ కిరణ్, 5 సంవత్సరాల బాలుడు షణ్ముఖ్, కూనపరెడ్డి వరలక్ష్మిల ప్రాణాలు దక్కడంతో వారిలో కాస్త ఊరటనిచ్చింది.

108 వచ్చి ఉంటే..
సంఘటన జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది 108కు ఫోన్‌చేసినా వారి నుండి స్పందన కనిపించలేదు. దీనికి తోడు వాహనంలో ఇంధనం లేకపోవడంతో రాలేమని చెప్పడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. వారే గనుక సకాలంలో వచ్చి ఉంటే మరి కొన్ని ప్రాణాలైనా దక్కేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న కొవ్వలికి కూడా 108 చేరుకోలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో డ్రైవర్‌..
మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఆరుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన కారు డ్రైవర్‌ కిరణ్‌ను దెందులూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్టేషన్‌ నుండి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనను నమోదు చేసుకుని దెందులూరు పోలీసులు విచారణ చేపట్టారు.

ఆసుపత్రి వద్ద విషాదఛాయలు
ఏలూరు అర్బన్‌ : ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి. కొవ్వలి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో పోలీసులు పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏలూరు టూ టౌన్‌ సీఐ జి.మధుబాబు, గణపరం సీఐ దుర్గాప్రసాద్, ఏలూరు టూ టౌన్‌ ఎస్సై కె.రామారావు, భీమడోలు ఎస్సై ఎస్‌ఎస్‌వి గంగాధర్‌ తమ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో మృతుల బంధువులు ఆసుపత్రికి చేరుకుని విగతజీవులై పడి ఉన్న తమవారిని చూసి భోరున విలపించడం చూపరుల హృదయాలను బరువెక్కించింది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం వైద్యులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కృష్ణా జిల్లా ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య ఏలూరు ఆసుపత్రికి వచ్చి మృతుల బంధువులను పరామర్శించారు.

Advertisement
Advertisement