Sakshi News home page

సమస్యల‘కుప్ప’ం

Published Wed, Feb 15 2017 10:17 PM

సమస్యల‘కుప్ప’ం - Sakshi

శంకుస్థాపనలు సరే.. నిధులేవీ?
నత్తనడకన హంద్రీ–నీవా
విస్తరణకు నోచని రోడ్లు
ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే అండర్‌ బ్రిడ్జి
కలగా పారిశ్రామిక వాడ
వలసబాట పడుతున్న యువత
కుప్పంలో ఇదీ పరిస్థితి
నేడు సీఎం రాక


అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారుగాజులు చేయిస్తానన్నట్టు ఉంది కుప్పంలో అభివృద్ధి పనుల పరిస్థితి. అంతర్జాతీయ హంగులతో అమరావతి నిర్మాణం అంటూ గొప్పలు చెబుతూ.. మహిళా సాధికారిత పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని గాలికొదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనుల్లేక నిరుద్యోగులు వలసలు వెళ్తున్నా.. గుక్కెడు నీళ్లులేక జనం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు.  ఈ మూడేళ్లలో ఏడు సార్లు     పర్యటించి రూ.1451 కోట్లమేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం తప్ప చేసిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

కుప్పం : కుప్పం నియోజకవర్గం సమస్యలతో సతమతమవుతోంది. నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. స్పెషల్‌ గ్రాంట్లు వచ్చి నా ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలు నీటిమూటలేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శంకుస్థాపనలతో సరి
గత ఏడాది ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబురూ.480 కోట్లతో హంద్రీ–నీవా కుప్పం కెనా ల్‌ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరత లేకుండా.. పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చా రు. కానీ చాలినన్ని నిధులు విడుదల చేయలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి.రూ.278 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉరవకొండ –కృష్ణగిరి వరకు 45వ జాతీయ రహదారి విస్తరణకు నిధులు కేటాయించినా పనులు నామమాత్రంగా సాగుతున్నాయి. కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వాయిదాలకే పరిమితమయ్యాయి. బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది.కుప్పం పట్టణంలోని రోడ్ల విస్తరణ కోసం రూ.7 కోట్లు విడుదలై ఆరు నెలలు దాటినా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.కుప్పం పట్టణం మధ్యలో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్ల వ్యయంతో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది.
     
రూ.8 కోట్లతో హార్టికల్చర్‌ హబ్‌ నిర్మాణానికి గత ఏడాది శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు.గుడుపల్లె మండలం, మల్లప్పకొండపై పవన విద్యుత్‌ ఏర్పాటుకు ఏడాదికి మునుపు శ్రీకారం చుట్టారు. కొండపై పవన విద్యుత్‌ పరీక్షించడానికి గాలిమరలు నిర్మించి గాలికొదిలేశారు. కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక వాడ నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఊదరగొడుతున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగాలు లేక పలువురు బెంగళూరుకు వలసబాట పడుతున్నారు. రూ.25 కోట్లతో బాలుర, బాలికల వసతి గృహాలు నిర్మిస్తున్నారు. కానీ ఏడాదిగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కుప్పం డిగ్రీ కళాశాల పనులూ పునాదులకే పరిమితమయ్యాయి.ప్రతి పంచాయతీ కేంద్రాన్ని కంప్యూటరీకరణ చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. అక్కడక్కడా ఏర్పాటు చేసిన కేబుల్‌ వైర్లు తుప్పుపడుతున్నాయి.ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చి మిన్నకుండిపోయారు. కుప్పం పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మొదటి దశగా రూ.12 కోట్లు నిధులు విడుదలైనా ఫలితం లేకపోతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement