కిష్టప్పా.. ఇదేందప్ప! | Sakshi
Sakshi News home page

కిష్టప్పా.. ఇదేందప్ప!

Published Wed, Aug 16 2017 10:01 PM

కిష్టప్పా.. ఇదేందప్ప!

అభివృద్ధి చేస్తానంటూ ఊరిని దత్తతకు తీసుకుంటివి
చుట్టపు చూపుగా కూడా రాకపోతివి
గ్రామ రూపురేఖలు మారుస్తానంటివి
రెండేళ్లుగా కనిపించకుండా పోతివి
సోమఘట్ట వాసుల ఆవేదన


హిందూపురం అర్బన్‌: ‘ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందంట’ అన్న చందంగా మారింది హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తీరు. తాను పుట్టి పెరిగిన మండలాన్ని అభివృద్ధి చేయలేని ఆయన.. దత్తత పేరుతో తీసుకున్న గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో  గోరంట్ల మండల వాసుల దాహార్తిని తీర్చలేకపోయారు. మండలాధ్యక్షుడిగాను,  ఎమ్మెల్యేగాను, ఎంపీగాను బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. తాను రైతు బిడ్డగా చెప్పుకుంటున్న నిమ్మల కిష్టప్పకు గ్రామీణ ప్రాంతాల దుస్థితిపై పూర్తి అవగాహన ఉంది. ఆయన అనుకుంటే గ్రామీణ ప్రాంత రూపురేఖలు మార్చగలరు. తన కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచేందుకు అవకాశముంది. అయినా ఆయనకు అవేమీ పట్టవు. ఆఖరుకు చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం దత్తతకు తీసుకున్న ఆయన.. తర్వాత ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మలంగా ఉండిపోయారు.

లోకసభ నియోజకవర్గం: హిందూపురం
పార్లమెంట్‌ సభ్యుడు : నిమ్మల కిష్టప్ప
దత్తతకు తీసుకున్న గ్రామం : సోమఘట్ట, చిలమత్తూరు మండలం
గ్రామంలోని గడపలు : 470
గ్రామ జనాభా    : 1,200


హిందూపురం లోకసభ నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. గ్రామ రూపురేఖలు మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ గ్రామస్తులకు అప్పట్లో ఆయన నమ్మబలికారు. అయితే ఈ రెండేళ్లలో ఆ గ్రామం ఇసుమంతైనా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేదు. అసలు గ్రామానికి రహదారి కూడా సక్రమంగా లేదు. గ్రామంలోకి నేటికీ ఎర్రబస్సు వెళ్లదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణమంటే ఆటోలే దిక్కు. డ్రెయినేజీ వ్యవస్థ లేదు. గ్రామం మధ్యలోనే మురుగు నీటి నిల్వలు పేరుకుపోయాయి. దోమలు, పందుల బెడదతో రోగాలు ప్రబలుతున్నాయి. ఇక తాగునీటి కోసం గ్రామీణులు పడే ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఉపాధి పనులు లేవు. వ్యవసాయం అంతంత మాత్రమే. పాడి పోషణకు ప్రోత్సాహం కరువైంది.. ప్రభుత్వం మంజూరు చేస్తున్న సొం‍తిల్లు కలగానే మిగిలిపోయింది.

గ్రామంలోని ప్రధాన సమస్యలివే
– సోమఘట్టలోని  బీసీ, ఎస్సీ ఇతర కాలనీలకు కనీస రోడ్డు సదుపాయం లేదు.
– గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఎక్కడిపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోయింది. దుర్గంధం వ్యాపిస్తోంది.
– తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం స్థానికులు వ్యవసాయ బోరు బావులపై ఆధారపడ్డారు.
– పశు ఉపవైద్యశాల లేకపోవడంతో పాడి రైతులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలోని పశువైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.
– గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదు.
– పంచాయతీ కార్యాలయం పక్కన మరుగుదొడ్డి నిర్మాణం కోసం వేసిన పునాది దీర్ఘకాలంగా అలాగే ఉండిపోయింది.
– పెద్ద చెరువు, చిన్న చెరువులకు వెళ్లే దారులు సరిగా లేకపోవడంతో అటుగా ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.

తాగునీటి సమస్య తీరలేదు
గ్రామంలో బోలెడు సమస్యలు ఉన్నాయి. తాగునీరు అందడం లేదు. నీటి కోసం పాలాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
- డి.చిన్నప్ప, సోమఘట్ట, చిలమత్తూరు మండలం

మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చారు
మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. రోడ్లు వేస్తానన్నారు. మురికి కాలులు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇంకా అదీ చేస్తాను.. ఇది చేస్తాను అని చెప్పారు. ఇయన్నీ చెప్పినాయన ఇటుగా వచ్చింది లేదు. ఎంపీ గెలిచిన ఈ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లారు. మా ఊరిని పట్టించుకునే వారే కరువయ్యారు.  
- శ్రీనివాసులు, సోమఘట్ట, చిలమత్తూరు మండలం.

Advertisement
Advertisement