పుణ్యఫలక్షేత్రం.. సోమశిల తీరం | Sakshi
Sakshi News home page

పుణ్యఫలక్షేత్రం.. సోమశిల తీరం

Published Wed, Aug 10 2016 1:12 AM

somashila temple

– సోమశిలలో దేశంలోని ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగాలు 
కొల్లాపూర్‌ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే మహాద్భాగ్యం.. సోమశిల సమీపంలో ప్రవహించే కృష్ణానదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని లలితాంబికా సోమేశ్వరాలయం ప్రధాన అర్చకులు వెంకటేశ్వరశర్మ పేర్కొన్నారు. జిల్లాలో పుష్కరాలు జరిగే ప్రధానమైన కేంద్రాలలో సోమశిల కూడా ఒకటి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలయంతోపాటు లలితాదేవి ఆలయాలు ఉన్నాయి. 
ఆలయ ప్రాశస్త్యం 
సోమశిలలోని లలితాంబికా సోమశ్వరాలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని, ఇక్కడి లింగాలను పాండవులు ప్రతిష్ఠించారని వేంకటేశ్వర శర్మ తెలిపారు. మహాభారతంలోని విరాటపర్వంలో సంగమేశ్వరం, సోమేశ్వరాలయాల గురించి ప్రస్తావన కూడా ఉందని అన్నారు. పాండవులు వనవాసం చేసే కాలంలో శివలింగాన్ని కొలిచేందుకు ధర్మరాజు సంసిద్ధుడయ్యారు. సప్తనదుల సంగమ ప్రాంతమైన సంగమేశ్వరం వద్ద శివలింగాన్ని, ప్రతిష్ఠించాలని తలంచాడు. భీమున్ని కాశీపట్నానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురావాలని ఆదేశించారు. ఆయన రాక ఆలస్యమవడం, ముహూర్త సమయం ముగిసిపోతుందని భావించిన ధర్మరాజు అక్కడున్న వేపచెట్టు మాను నరికి శివలింగంగా ప్రతిష్టించాడు. కొద్దిసేపటికే భీముడు ఐదు లింగాలను తీసుకుని సంగమేశ్వరం చేరుకుంటాడు. అప్పటికే శివలింగ ప్రతిష్ఠ చేయడంతో తాను తెచ్చిన లింగాలను భీముడు దూరంగా విసిరాడు. అవి నది పరివాహక ప్రాంతంలో పడ్డాయి. భీముని అసహనాన్ని గమనించిన శ్రీకృష్ణుడు అతని వద్దకు చేరుకుని నీవు తెచ్చి లింగాలు వ్యర్థం కావు, నిత్య పూజలందుకుంటాయని నచ్చజెప్పారు. ఆయన అన్నట్లుగానే భీముడు విసిరేసిన లింగాలు ఒకటి సోమశిలలో, రెండవది మల్లేశ్వరంలో, మూడోదో కర్నూల్‌ జిల్లాలోని సంగమేశ్వరంలో, నాలుగోది సిద్ధేశ్వరంలో, ఐదోది కపిలేశ్వరంలో ఇప్పటికీ నిత్యపూజలందుకుంటున్నాయి. 
 
కాకతీయుల కాలంలో ఆలయాలు
11వ శతాబ్దంలో చాళుక్య రాజులు సోమశిలలో గుడిని నిర్మించారు. ఆ గుడిని కాకతీయులు అభివృద్ధి చేశారు. అయితే దేశం నలుమూలల్లో గల ప్రధాన శైవ క్షేత్రాలను దర్శించుకోలేని సామాన్యుల కోసం కాకతీయులు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. సోమశిలలోని సోమేశ్వర శివలింగాన్ని భీముడు విసిరేసినందున ఈ లింగానికి భీమ సోమేశ్వరలింగంగా పేరుపొందింది. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ (కృష్ణానది)లో మునిగిపోయింది. దీనిని అప్పటి ప్రభుత్వం యధాతథంగా నదీ తీరంలో.. ప్రస్తుతం ఉన్న సోమశిలలో పునఃప్రతిష్ఠించింది. సోమశిలలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను దైవ గురువు అయిన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుష్కరాల సమయంలో కృష్ణానదిలో స్నానమాచరించి దర్శించుకుంటే పుణ్య ఫలాలు లభిస్తాయని వెంకటేశ్వరశర్మ వెల్లడించారు. నదిలో స్నానంచేసి దానం, క్షౌర కార్యక్రమాలు నిర్వహించే వారికి మూడు కోట్ల కులాలను ఉద్దరించిన ఫలితం దక్కుతుందన్నారు. పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు చేయడం వల్ల సార్థకం లభిస్తుందని వివరించారు. 
 
సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 
దేశంలోని ప్రధానమైన 12శైవ క్షేత్రాల్లో గల జ్యోతిర్లింగాలు సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరాలయంలో ఉన్నాయి. శివలింగాల పేర్లు.. అవి ఉన్న ప్రాంతాలు.. 
1)  మల్లిఖార్జునుడు (శ్రీశైలం) 
2) సోమనాథేశ్వరుడు(గుజరాత్‌) 
3) మహా కాళేశ్వరుడు(ఉజ్జయిని) 
4) ఓంకారేశ్వరుడు(మమరేశ్వరం) 
5) వైద్యనాథుడు (బీహార్‌) 
6) భీమ శంకరుడు (పూణె) 
7) రామేశ్వరుడు (రామేశ్వరం) 
8) నాగేశ్వరుడు (ద్వారక) 
9) విశ్వేశ్వరుడు (కాశీ) 
10) త్రయంబకేశ్వరుడు (నాసిక్‌) 
11) కేదారేశ్వరుడు (కేదార్‌నాథ్‌) 
12) ఘృశ్నేశ్వరుడు (ఎల్లోరా)  

Advertisement
Advertisement