సోమ్లా తండాకు జ్వరం | Sakshi
Sakshi News home page

సోమ్లా తండాకు జ్వరం

Published Tue, Aug 2 2016 11:21 PM

సోమ్లా తండాకు జ్వరం - Sakshi

  • కలుషిత జలాలే కారణమంటున్న తండావాసులు
  • వైద్య శిబిరం నిర్వహించాలని వేడుకోలు
  • డోర్నకల్‌ : డోర్నకల్‌ పట్టణ పరిధిలోని సోమ్లా తండాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరం తండావాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది డోర్నకల్‌తో పాటు ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానికులు వాంకుడోత్‌ శారద, వాంకుడోత్‌ ఉపేందర్, దేవ్‌సింగ్, ధారావత్‌ సోనియా, రుక్మిణి, వాంకుడోత్‌ వరుణ్‌తేజ్, బానోత్‌ పార్వతి, కమిలి తదితరులు జ్వరంతో మంచంపట్టారు. సుమారు 80 కుటుంబాలు ఉన్న ఈ తండాకు రక్షిత మంచినీటి బావి, బోరు బావి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వాటి నుంచి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని, అవి తాగడం వల్లే అనారోగ్యం బారిన పడుతున్నట్లు తండావాసులు పేర్కొంటున్నారు. బోరు బావి ద్వారా సరఫరా అయ్యే నీటినే తాగాలని ఇప్పటికే తాము సూచించామని గ్రామ పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు స్థానికంగా పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం అందించాలని తండావాసులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement