Sakshi News home page

ప్రత్యేక గర్జన

Published Tue, Aug 2 2016 10:13 PM

ప్రత్యేక గర్జన - Sakshi

హోదా బంద్‌ విజయవంతం
– వైఎస్‌ఆర్‌సీపీ పిలుపునకు విశేష స్పందన
– మద్దతు పలికిన వామపక్షాలు, కాంగ్రెస్‌
– కలిసివచ్చిన ప్రజా సంఘాలు
– స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన ప్రజలు
– మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు
– పోలీసుల తీరు వివాదాస్పదం
 
నిర్మానుష్యంగా మారిన రహదారులు.. డిపోలు దాటని ఆర్టీసీ బస్సులు.. మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు.. ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నవ్యాంధ్ర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపై విప్పిన గళం హోరెత్తింది. స్వయంగా ప్రభుత్వమే అణచివేతకు దిగినా.. అడుగడుగునా పోలీసుల అవాంతరాలు సష్టించినా ఎదురొడ్డి సాగించిన పోరాటం స్ఫూర్తి రగిల్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపుతో చేపట్టిన జిల్లా బంద్‌ విజయవంతమయింది.
 
సాక్షి, కర్నూలు:
ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో మంగళవారం చేపట్టిన జిల్లా బంద్‌కు ప్రజల సంపూర్ణ మద్దతు లభించింది. వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ, ఎస్‌డీపీఐ, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తదితర పార్టీలు బంద్‌కు అండగా నిలిచాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా.. వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు.. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. బ్యాంకులు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. అయితే శాంతియుతంగా సాగుతున్న బంద్‌ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. ఆందోళనకారులపై లాఠీ ఝళిపించడంతో పాటు.. నాయకులను ముందస్తు అరెస్టులతో పోలీసుస్టేషన్లలో నిర్బంధించారు. ఇంత జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా హోదాపై గళం వినిపించకపోవడం గమనార్హం.
 
కర్నూలులో..
నగరంలో తెల్లవారుజామున నుంచే ప్రధాన కూడళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బంద్‌ చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోటార్‌ సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ నేతత్వంలో నాయకులు, కార్యకర్తలు బస్సులను కదలనీయకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి సి.క్యాంప్, కలెక్టరేట్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అప్పటికే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, హఫీజ్‌ఖాన్, నగర అధ్యక్షుడు నర్సింహులు యాదవ్, రాంపుల్లయ్య యాదవ్‌.. సీపీఎం నేతలు ప్రభాకర్‌రెడ్డి, షడ్రక్, పుల్లారెడ్డి.. సీపీఐ నేతలు రామాంజనేయులు, జగన్నాథం, రసూల్, మనోహర్‌ మాణిక్యం తదితరులను అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement