Sakshi News home page

రైలు ఢీకొని పెయింటర్‌ మృతి

Published Sun, Aug 7 2016 12:58 AM

రైలు ఢీకొని పెయింటర్‌ మృతి - Sakshi

 
నెల్లూరు (క్రైమ్‌) : రైలు ఢీకొని పెయింటర్‌ మృతి చెందిన సంఘటన ఎస్‌–2 థియేటర్‌ సమీప రైలు పట్టాలపై శనివారం జరిగింది. చిల్డ్రన్స్‌పార్కు సమీపంలోని గుర్రాలమడుగుకు చెందిన ఎ.మురళీకృష్ణ (30) పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా ఆయన వ్యసనాలకు బానిసై సంపాదన ఖర్చు చేయసాగాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. పలుమార్లు భార్య మమత అతన్ని పద్ధతి మార్చుకోమని సూచించింది. అయినా ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఇటీవల ఆమె తన కుమారుడితో కలిసి వడ్డిపాళెంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మురళీకృష్ణ ఫూటుగా మద్యం సేవించి పనికి వెళ్లడం మానేశాడు. భార్యను కాపురానికి రమ్మన్నాడు. ఆమె రాకపోవడంతో మరింత మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎస్‌–2 థియేటర్‌ సమీపంలో చెన్నై వెళ్లే రైలు పట్టాల వద్ద రైలు ఢీకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో లభ్యమైన  ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతను ప్రమాదవశాత్తు మృతి చెందాడా?. ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement