అవార్డు బాధ్యత పెంచింది | Sakshi
Sakshi News home page

అవార్డు బాధ్యత పెంచింది

Published Sat, Sep 3 2016 12:00 AM

state best teacher

  • రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు సత్యనారాయణ ఎంపిక 
  • వేళంగి కాలేజీ అభివృద్ధికి విశేష కృషి
  • వేళంగి(కరప): 
    నిబద్ధతతో పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి వేళంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా జిల్లా నుంచి సత్యనారాయణరెడ్డి ఒక్కరే ఎంపికయ్యారు. కష్టించి పనిచేసి అంచెలంచెలుగా ప్రిన్సిపాల్‌ స్థాయికి ఎదిగిన ఆయన అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. 
    వ్యక్తిగత వివరాలు
    పశ్చిమ గోదావరి జిల్లా ఏలేటిపాడు గ్రామానికి చెందిన సత్తి సత్యనారాయణరెడ్డి తులసమ్మ దంపతుల కుమారుడు వీర వెంకట సత్యనారాయణరెడ్డి. 10వ తరగతి వరకు సొంతగ్రామంలో, ఇంటర్మీడియట్, డిగ్రీ పెనుగొండలో చదివారు. డిగ్రీతో 1984లో రికార్డు అసిస్టెంట్‌గా రావులపాలెం కళాశాలలో చేరారు. 1990లో ఆయనకు అదే కళాశాలలో టైపిస్ట్‌గా పదోన్నతి లభించింది. ఆlకళాశాలలో లెక్చరర్‌గా అప్పుడు పని చేస్తున్న   పి.కోటేశ్వరరావు సలహా మేరకు సత్యనారాయణరెడ్డి ఎమ్మెస్సీ ప్రైవేట్‌గా రాసి ఉత్తీర్ణులయ్యారు. 1998లో జూనియర్‌ లెక్చరర్‌(లెక్కలు)గా పదోన్నతిరాగా ఆలమూరు కళాశాలలో పనిచేశారు. జేఎల్‌గా రావులపాలెం, ఆలమూరు కళాశాలల్లో సత్యనారాయణ సేవలందించారు. 2000– 2005 సంవత్సరాల మధ్య ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగామ్‌ ఆఫీసర్‌గా ఏడాదికి రెండు వంతున 10 ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా  అధికారుల, ప్రజల మన్ననలు పొందారు. తాను జేఎల్‌  పనిచేసిన కళాశాలల్లో లెక్కల సబ్జెక్టులో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 2012లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతిపై సత్యనారాయణరెడ్డి ఆలమూరు నుంచి వేళంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చారు.
    కళాశాల ప్రగతి
    సత్యనారాయణరెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చేంతవరకూ వేళంగి కాలేజీలో 40 శాతం ఉత్తీర్ణత వచ్చేది. ఈ నాలుగేళ్లలో ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుతూ జిల్లాలో ఉత్తీర్ణతలో ద్వితీయ స్థానానికి కళాశాలను తీసుకువెళ్లిన ఘనత ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డికే దక్కుతుంది. 2014లో జిల్లాలో తృతీయస్థానం, 2015లో ద్వితీయ స్థానం, 2016లో 83.03 శాతంతో ఫస్ట్‌ ఇయర్‌లో జిల్లాలో ద్వితీయ స్థానంలో కళాశాల నిలిచింది. జిల్లాలో ఎక్కడాలేని విధంగా సిబ్బంది, దాతల సహకారంతో కాలేజీలో మధ్యాహ్నభోజనపథకాన్ని అమలు చేశారు. గ్రామపెద్దలు మెర్ల వీరయ్యచౌదరి, డాక్టర్‌ బొండా వెంకన్నారావు, చుండ్రు వెంకన్నరాయ్‌చౌదరి, చుండ్రు శంకర్రావు, స్టాప్‌ సహకారంతో 200 మంది విద్యార్థులకు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి నెలవరకు మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. ఓఎజ్జీసీ సంస్థ ఆర్థిక సాయంతో కళాశాలలో రూ. లక్షతో మరుగుదొడ్లు, రూ. 3.21 లక్షలతో సైకిల్‌ షెడ్‌ నిర్మింపజేశారు.
     
    అందరి సహకారంవల్లే ఈ అవార్డు
     కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, గ్రామస్తుల సహకారంతో కళాశాల ప్రగతికి చేసినకృషి ఫలితమే రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు రావడానికి కారణమని ప్రిన్సిపాల్‌ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. ఈఅవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, అధ్యాపకుల సహకారంతో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యనందించేందుకు కృషిచేస్తానన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement