హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు | Sakshi
Sakshi News home page

హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

Published Mon, Jan 30 2017 10:34 PM

state future depend on spl satatus

 
ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు
టీడీపీ, బీజేపీలు అవాస్తవాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయి
హోదాతో లాభమా, నష్టమా అనేది బాబు స్పష్టం చేయాలి
 ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి
 
నరసరావుపేట రూరల్: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేక హోదాకు పాలకపక్షమే అడ్డుపడుతోందని విమర్శించారు. నరసరావుపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయం నుంచి టీడీపీ, బీజేపీలు చెప్పిన మాట చెప్పకుండా అవాస్తవాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ధ్వజమెత్తారు. విభజన బిల్లు సమయంలోనే ప్రత్యేక హోదాపై బిల్లు పెట్టాలని బీజేపీ నాయకత్వం ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.  ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు, పదిహేను సంవత్సరాలు కావాలని చంద్రబాబు అడిగారని గుర్తుచేశారు. నేడు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది అని చంద్రబాబు మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏ మేలు జరగటం లేదనుకుంటే టీడీపీ నాయకులు అక్కడ పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. హోదాకు సరిపడా ప్యాకేజీ ఇస్తున్నారని చేబుతున్నారని, హోదావల్ల ఏంత వస్తుందో అంచనా వేశారా అని ప్రశ్నించారు. కేంద్రం అదనంగా ఏమి ఇచ్చిందో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టంచేశారు.  తమ లాలూచీ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే సమ్మెట్‌ పేరుతో లక్షల్లో ఉద్యోగాలు, కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు.
నిరుద్యోగ యువతపై పీడీ యాక్డు పెడతామనడం సిగ్గుచేటు
 రాష్ట్రంలోని 46వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, రెండు లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారని గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల శాఖ ప్రకటించిందని... ఈ వివరాలు బహిర్గతం చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. గడిచిన మూడేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని, అదనంగా పరిశ్రమలు రాలేదని, ఉద్యోగం, ఉపాధి లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా  సాధిచేందుకు  నిరుద్యోగ యువత ముందుకోస్తే వారిపై పీడీ యాక్ట్‌ పెడతామనడం సిగ్గుచేటన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే కేంద్ర విశ్వవిద్యాలయాలు మనకు వచ్చాయని, ఇందులో ప్రత్యేకంగా వచ్చినవి ఏమీ లేవని అన్నారు. ప్రత్యేక హోదాపై రెండు సార్లు శాసన సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని, వారు దానిని బుట్టదాఖలు చేస్తే రాష్ట్ర పరువు ఏమి కావాలని ప్రశ్నించారు. హోదా రాదు అని తెలిస్తే తీర్మానం చేసి ఎందుకు పంపించారని నిలదీశారు. పోలవరానికి  నాబార్డు ఇచ్చిన రూ.1900 కోట్ల రుణానికి బాధ్యత కేంద్రానిదో, రాష్ట్రానిదో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.    చంద్రన్న కానుకల పేరుతో రెండు సంవత్సరాలుగా రూ.1900 కోట్లు ఖర్చు చేశారని, ఈ నిధులను పోలవరానికి ఖర్చు చేస్తే సరిపోయేదని పేర్కొన్నారు.   పుష్కరాల కోసం రూ.3600 కోట్లు వృథాగా ఖర్చు చేశారని విమర్శించారు. తెలంగాణలో పుష్కరాల కోసం రూ.1100 కోట్లు మాత్రమే ఖర్చుపెటినట్టు తెలిపారు. 
చంద్రబాబుకు అల్జిమర్స్‌ వ్యాధి: ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి
ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన అల్జిమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు  ఉందని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి అన్నారు. హోదా పదిహేను సంవత్సరాలు కావాలని గొంతు చించుకుని అరిచిన బాబు.. నేడు హోదాతో ఏమీ రాదని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. హోదా వల్ల లాభమా, నష్టమా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్భాటం కోసమే సమ్మెట్‌లు నిర్వహించి లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీనాయకులు సుజాతపాల్, రామిశెట్టికొండ, ఎన్‌.కె. ఆంజనేయులు, మండాలక్షణ్‌రావు, మల్లెల అశోక్, పుల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement