ఇంకా చెరలోనే... | Sakshi
Sakshi News home page

ఇంకా చెరలోనే...

Published Sat, Nov 21 2015 12:34 AM

ఇంకా చెరలోనే... - Sakshi

చర్ల: మూడు రోజుల కిందట ఆరుగురు టీఆర్‌ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు ఇంకా వదిలిపెట్టలేదు.‘డబుల్ బెడ్‌రూం ఇళ్ల’ పథకంలో లబ్ధిదారులను గుర్తించేందుకు చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామానికి వెళ్లిన టీఆర్‌ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి నూనె రామకృష్ణ, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన మండల మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. ప్రభుత్వం ముందు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలగాణ అధికార ప్రతినిధి జగన్ పలు డిమాండ్లను పెట్టి ప్రకటన చేయాలని, లేనిపక్షంలో బందీలను ఖతం చేస్తామని హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. దీంతో బందీల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రెండు రోజులైనప్పటికీ కిడ్నాప్‌నకు గురైన వారి జాడ లేకపోవడంతో వారిని వెతుకుతూ కుటుంబ సభ్యులు అడవిబాట పట్టారు. శుక్రవారం టీఆర్‌ఎస్ చర్ల మండల మాజీ ప్రధాన కార్యదర్శి సంతపురి సురేష్‌కుమార్ భార్య, బంధువులు, పూసుగుప్ప మాజీ సర్పంచ్ ఉయికా రామకృష్ణ భార్యాపిల్లలు, వెంకటాపురం మండల మాజీ ప్రధాన కార్యదర్శి డెక్కా సత్యనారాయణ భార్య, కుటుంబ సభ్యులు పూసుగుప్ప అటవీ ప్రాంతానికి వెళ్లి గాలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం, భీమవరంపాడు గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీసినప్పటికీ అక్కడి ఆదీవాసీలు తమకు తెలియదని సమాధానం చెప్పడంతో వారు తిరుగుముఖం పట్టారు. తమ వారికి హాని తలపెట్టకుండా మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలని వారు వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, కొత్తగూడెం ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. దండకారణ్య సరిహద్దులో సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు మరోవైపు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Advertisement
Advertisement