24న అసెంబ్లీ ఎదుట ధర్నా | Sakshi
Sakshi News home page

24న అసెంబ్లీ ఎదుట ధర్నా

Published Fri, Mar 10 2017 10:55 PM

24న అసెంబ్లీ ఎదుట ధర్నా

అనంతపురం అర్బన్‌ : బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన జిల్లా రైతులు అక్కడ అడుక్కుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ నెల 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిపక్షం, వామపక్షాలు పాల్గొనాలని కోరారు. శుక్రవారం స్థానిక సిద్ధార్థ పంక్షన్‌ హాల్‌లో తరిమెల నాగిరెడ్డి శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించారు. కమిటీ కన్వీనర్‌ డి.గోవిందరాజులు అధ్యక్షత వహించారు.

ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల జీవనం దయనీయంగా మారినా, ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతోందని విమర్శించారు. అధిక ఆదాయం కోసమే ప్రజలు వలస పోతున్నారని అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వాదనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కరువును పారదోలామని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

    సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, కూలీలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకోని ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంటే అధికార యంత్రాంగం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తోందన్నారు. ఫారం పాండ్ల తవ్వకంతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందని కలెక్టర్‌ విశాఖపట్టణంలో ప్రజెంటేషన్‌ ఇవ్వడం సరికాదన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లా మొత్తం ఖాళీ అవుతుందన్నారు. గత ఏడాది చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.5.27 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా నిధులు సమకూర్చిందని మండిపడ్డారు.

    నీటి పారుదల రంగం నిపుణుడు పాణ్యం సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు కనీసం 10 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలన్నారు. సమావేశంలో తరిమెల నాగిరెడ్డి శత జయంతి కమిటీ సభ్యులు తరిమెల శరత్‌ చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్‌ ఇమాం, నాయకులు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కేవీ రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, సలీమ్‌ మాలిక్, రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement