డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Wed, Jun 14 2017 10:54 PM

student suicide

తేలని‘ఫలితం’  

ఎస్కేయూ: రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఎస్కేయూలోని పరీక్షల విభాగంలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టి మరోసారి పరీక్షలు రాశాడు. 2016 నవంబర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు మాత్రం ఫలితాలు ప్రకటించలేదు. కారణం ఆరా తీస్తే కామన్‌ సర్వీసెస్‌ ఫీజు చెల్లించలేదన్న సమాధానం వచ్చింది.

వాస్తవానికి అతను ఏటా రూ. 1,050 యూనివర్సిటీ కామన్‌ సర్వీసెస్‌ ఫీజును అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలకు చెల్లించాడు. కానీ వారు వర్సిటీకి చెల్లించకపోవడంతో డిగ్రీ ఫలితాలు అనౌన్స్‌డ్‌ లేటర్‌ కింద చూపారు. బకాయిలు చెల్లించేంతవరకు ఫలితాలు, మార్క్స్‌ కార్డులు జారీ చేసేది లేదని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు. ఆరునెలల పాటు వర్సిటీ చుట్టూ తిరిగిన యువకుడు బుధవారం నేరుగా అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌ వద్దకు చేరుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన ఆర్ట్స్‌ కళాశాల సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. వెంటనే ఆర్ట్స్‌ కళాశాల జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు ఎస్కేయూ పరీక్షల విభాగం వద్దకు చేరుకుని బాధిత విద్యార్థికి న్యాయం చేసేందుకు పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ యువకుడు ఒక్కడే కాదు.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల వైఖరితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని తెలుస్తోంది.

విద్యార్థితో కట్టించుకొన్నప్పటికీ..

డిగ్రీ కోర్సులు చదువుతున్న ప్రతి విద్యార్థితోనూ .. యూసీఎస్‌ ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సకాలంలో వర్సిటీకి ఫీజులు చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థుల ఫలితాలు నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది. వర్సిటీ నిర్ధారించిన మొత్తం కంటే అదనంగా ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ .. వర్సిటీకి చెల్లించడంలో తాత్సారం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 

Advertisement
Advertisement