ముగ్గురు విద్యార్థుల గల్లంతు | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

Published Sat, Sep 10 2016 10:18 PM

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

  • ఒకరిని రక్షించిన మడనూరు బీచ్‌ మత్స్యకారులు
  • మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం
  • వీరి ముగ్గురిదీ టంగుటూరు మండలం కొణిజేడు
  • మడనూరు (కొత్తపట్నం) : వినాయక నిమజ్జనం కోసం వచ్చిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతుకాగా స్థానిక మత్స్యకారులు ఒకరిని రక్షించారు. ఈ విషాదకర సంఘటన మడనూరు బీచ్‌లో శనివారం జరిగింది. వివరాలు.. టంగుటూరు మండలం కొణిజేడుకు చెందిన యద్దనపుడి వెంకటేష్‌ (17), మానం నాగరాజు (17), తాటిబోయిన మనికంఠసాయి(19)లు గ్రామానికి చెందిన మరో 20 మంది యువకులతో కలిసి వినాయక నిమజ్జనం కోసం మడనూరు సముద్రతీరానికి వచ్చారు. వినాయకుని నిమజ్జనం అనంతరం యువకులు సముద్ర స్నానం చేసేందుకు వెళ్లారు.
     
    అలలు ఉధృతికి తట్టుకోలేక వెంకటేష్ల్, నాగరాజు, మణికంఠసాయి అనే ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న మత్స్యకారులు గల్లంతైన ముగ్గురినీ కాపాడేందుకు సముద్రంలో దిగారు. మనికంఠసాయిని మాత్రమే రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. సముద్రం ఒడ్డుకు వచ్చిన కొణిజేడు యువకులు దిగాలు చెంది అక్కడే ఉన్న మెరైన్‌ పోలీసులకు సమచారం అందించారు. ఎస్సై తన సిబ్బందితో వచ్చి గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వలల సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చే సినా ఫలితం లేకపోయింది.
     
    ముగ్గురూ విద్యార్థులే
    వెంకటేశ్వర్లు ఒంగోలులోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు ఇంటర్‌ రెండో సంవత్సం చదువుతూ కొద్ది రోజుల క్రితం కాలేజీ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. మనికంఠసాయి ఒంగోలులోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సముద్రంలో గల్లంతు కావడంతో వెంకటేశ్వర్లు తండ్రి ఆంజనేయులు భోరున విలపిస్తున్నాడు. ఆ ఇద్దరి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
     
    సమాచారం తెలుసుకున్న ఒంగోలు  రెండో పట్టణ సీఐ దేవప్రభాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మిగిలిన యువకుల వివరాలు సేకరించారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ తెలిపారు. ఆయనతో పాటు స్థానిక ఎస్సై ఫణిభూషన్‌ ఉన్నారు. 

Advertisement
Advertisement