Sakshi News home page

ఒంటిపూట బడైనా వణుకే

Published Sat, Mar 26 2016 3:29 AM

ఒంటిపూట బడైనా వణుకే - Sakshi

పెరుగుతున్న ఉష్ణోగ్రత లు
పరీక్షల సెంటర్లలో మిట్టమధ్యాహ్నం బడులు
పేరుకి ఒంటిపూటే .. నడిఎండలోనే ఇంటికి తిరుగుముఖం

 ఒంగోలు: వేసవి ఉష్ణోగ్రతలు విద్యార్థులను వణికిస్తున్నాయి. బడి వేళలు నిర్ణయించడంలో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాఠశాలలకు అయినా, ఉన్నత విద్యకు అయినా ఒకే మంత్రి ఉన్నప్పటికి పాఠశాల, కాలేజీ స్థాయి అధికారుల మధ్య సరైన అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే వేసవి వస్తే పలు పాఠశాలల విద్యార్థులు వేసవి తాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

 వేళలు ఇలా :
వేసవి ప్రారంభం అయిందంటే ఒంటిపూట బడులు ప్రారంభించడం ప్రతి ఏటా జరుగుతున్నదే.  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. బడి 12.30 గంటలకు ముగిస్తే వారికి మధ్యాహ్న భోజన ప్రక్రియ ముగిసేసరికి ఒంటి గంట లేదా 1.30 గంట అవుతుంది. అంటే వడగాడ్పులలో, మండుటెండల్లో విద్యార్థులు తిరుగుముఖం పట్టడం అంటే ఒంటి పూట బడుల ఆశయానికి గండిపడినట్లే ..

 నూతన వేళలూ ఇబ్బందే ..
ఈ నేపథ్యంలో జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు. బడి వేళలను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు. బడి ముగియగానే మధ్యాహ్న భోజన ప్రక్రియ ముగించి వాతావరణం మరీ వేడెక్కకముందే విద్యార్థులను ఇంటిముఖం పట్టించే పరిస్థితులకు శ్రీకారం చుట్టారు.

 ఒంటిపూట బడులు .. సమస్యలు

 4  ఉదయం 7గంటలకే పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించడంతో సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో  పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పెను సమస్యగా మారింది. 6 గంటలకే విద్యార్థులు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రహసనంగా మారింది.

 4  జిల్లావ్యాప్తంగా 184 పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల వల్ల ఆ కేంద్రాల్లో ఒంటిపూట బడులు ఒక ప్రహసనంగా మారింది. ఈ పాఠశాలల్లో పిల్లలు మధ్యాహ్నం ఒంటిగంటకు పాఠశాలకు హాజరుకావాల్సి వస్తోంది. 12.30 గంటలకు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుండడంతో అప్పుడు వారికి బడిలోకి అనుమతి ఉంటుంది. మిట్టమధ్యాహ్నం ఈ పిల్లలు బడికి రావాల్సి వస్తోంది. మరి పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం ఈ పిల్లలపై ఉండదా?

 4 పట్టణాల్లో ఒంటిపూట బడుల్లో పిల్లలను వదిలితే 90 శాతం మంది పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. పల్లెల్లో తల్లిదండ్రులు పొలం బాట పడుతుండడంతో ఇంటికి వెళ్లిన పిల్లలు ఇంటిపట్టునే ఉండని పరిస్థితులు నెలకొన్నాయి.

 4 తాము పొలం బాట పడుతుంటే పిల్లలు ఈతల పేరుతో చెరువులు, నీటికుంటలకు వెళుతున్నారని, అందువల్ల వారిని మీ బడిలోనే మధ్యాహ్నం ఉండనిచ్చేలా చేయాలని కోరుతున్నారు.

 

 నిపుణులు ఏమంటున్నారంటే...

♦  గతంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య వేర్వేరు మంత్రుల పరిధిలో ఉండేవని, కాని ప్రస్తుతం ఒకే మంత్రి పరిధిలో ఉన్నందున కొంత మార్పులు అవసరమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇంటర్ పరీక్షలు ముగియగానే పదో తరగతి పరీక్షలు ప్రారంభిస్తే(రెండు పరీక్షల తేదీలు ఒకే రోజు రాకుండా) జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 184 సెంటర్లకు సంబంధించిన విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఇంటర్‌మీడియట్ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చనేది వారి వాదన.

సాధారణంగా పది పరీక్షలు ముగియగానే విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఎలాగు ప్రైవేటు కాలేజీలు పోటీపడడం సహజం అయిన దృష్ట్యా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇందుకు సంపూర్ణ సహకారాన్ని అందించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

రేకుల షెడ్లు కాకుండా కాస్త పక్కా భవనాలు ఉండి, ఫ్యాన్లు, ఏసీ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు కాస్త మినహాయింపు ఇస్తే పిల్లలు నీడపట్టునే ఉంటారనేది వాస్తవం.

కనీస వసతులకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ ఇకనుంచైనా శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement