చదువుకోవాలంటే సాహసమే! | Sakshi
Sakshi News home page

చదువుకోవాలంటే సాహసమే!

Published Mon, Sep 19 2016 10:33 PM

బస్సు పైకెక్కి మెదక్‌ వస్తున్న విద్యార్థులు

- గ్రామీణ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
- బస్సు పైకెక్కి ప్రమాదకర ప్రయాణం

మెదక్‌: మారుమూల ప్రాంతాల విద్యార్థులు చదువుకోవాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే! ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు.. సరైన రవాణా సౌకర్యాలు లేక బస్సుల పైకెక్కి ప్రయాణాలు చేస్తున్నారు. మెదక్‌ పట్టణంలో పదో తరగతి మొదలుకొని పాలిటెక్నిక్‌ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాల, బాలుర కళాశాల, డిగ్రీ కాలేజీ, గురుకుల పాఠశాలలు, ఐటీఐలతో పాటు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థలున్నాయి.

దీంతో నిత్యం దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు నిజామాబాద్‌ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంతో పాటు మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగ్‌ తదితర మండలాల విద్యార్థులు బస్సుల్లో మెదక్‌ వస్తుంటారు. కాగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు బండ్ల పైకెక్కి ప్రయాణిస్తున్నారు.

దీంతో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో బూర్గుపల్లి-వాడి బస్సు మెదక్‌ వస్తుండగా కొందరు విద్యార్థులు టాప్‌ పైకి ఎక్కారు. కరెంట్‌ సర్వీస్‌ వైర్లు విద్యార్థుల మెడకు తగలడంతో విద్యార్థి కిందపడిపోయాడు. అదేవిధంగా బస్సు డోర్‌ వద్ద నిలబడి ప్రయాణించే విద్యార్థులు జారి కిందపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

మారుమూల పల్లెలకు సర్వీస్‌ నిల్‌
కొన్ని మారుమూల పల్లెలకు ఆర్టీసీ సర్వీసులను నడపడం లేదు. దీంతో పేదవిద్యార్థులు ప్రాథమిక చదువులతో సరిపెడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement