ముగిసిన జిల్లా సబ్‌జూనియర్‌ చెస్‌ టోర్నీ | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా సబ్‌జూనియర్‌ చెస్‌ టోర్నీ

Published Tue, Oct 25 2016 1:06 AM

ముగిసిన జిల్లా సబ్‌జూనియర్‌ చెస్‌ టోర్నీ

 
నెల్లూరు(బృందావనం) : జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని చిల్డ్రన్స్‌పార్క్‌ సమీపంలో ఉన్న సుమన్‌ చెస్‌ అకాడమీలో జరుగుతున్న జిల్లా సబ్‌జూనియర్‌ చెస్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలురవిభాగంలో ఈ.సాయికార్తీక్, బాలికల విభాగంలో పి.మేఘన విజేతలుగా నిలిచారు. అండర్‌–15 బాలుర విభాగంలో 61మంది హాజరుకాగా 5 రౌండ్లకు గానూ సాయికార్తీక్‌ 5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బాలికల విభాగంలో 19 మంది పాల్గొనగా 4 రౌండ్లకు గానూ మేఘన 4 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పోటీలను ఆదిత్యవిద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య పర్యవేక్షించారు. విజేతలను చెస్‌టోర్నీ ఆర్బిటర్స్‌ వంశీకృష్ణా, వెంకటరమణ, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.సుమన్‌ అభినందించారు. 
రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనే వారు..
- వైఎస్‌ఆర్‌జిల్లా కడపలో నవంబరు 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్‌–15 టోర్నీలో జిల్లా నుంచి బాలుర విభాగంలో ఈ.సాయికార్తీక్, ఏ.ఎం.శ్రీహరి, ఎన్‌.తారకేశ్వర్‌రెడ్డి, సి.రిషిధర్‌రెడ్డి, బాలికల విభాగంలో పి.మేఘన, ఎం.కీర్తన, టీకే సుప్రియ, స్నేహశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు చెప్పారు. రాష్ట్రస్థాయి విజేతలు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో నవంబరు20 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.  

Advertisement
Advertisement