దా‘రుణం’ | Sakshi
Sakshi News home page

దా‘రుణం’

Published Fri, Jul 7 2017 2:03 AM

Subsequently expand troubles

రైతులను వెంటాడుతున్న రుణమాఫీ అనంతర కష్టాలు
మరుగుదొడ్ల నిధులు.. ఉపాధి హామీ వేతనాలు    బకాయిలకు జమ చేస్తున్న బ్యాంకర్లు
ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక


నాయుడుపేట మండలం భీమవరం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కోటపూరి చినపెంచలయ్య. 2007 మే నెలలో 3.20 ఎకరాల భూమిపై రూ.10 వేలను వ్యవసాయ రుణంగా తీసుకున్నాడు. 2010లో రూ.40 వేలు తీసుకుని.. రుణాన్ని రీ షెడ్యూల్‌ చేయించుకున్నాడు. 2013 నాటికి వడ్డీతో కలిపి అప్పు రూ.90 వేలకు చేరింది. పంటలు పండకపోవడంతో రుణం తీర్చలేకపోయాడు. 2014లో రైతులకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా రుణ ఉపశమనం పేరిట రూ 26,450 అతని ఖాతాలో జమ అయ్యింది. మిగిలిన మొత్తం మంజూరు కాకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో అతని అప్పు తీరలేదు. బకాయి మొత్తం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు చినపెంచలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు.

వర్షాలు లేక పంటలు పండని స్థితిలో ఉన్న ఈ రైతు బకాయి చెల్లించే పరిస్థితిలో లేడు. అయినా.. బ్యాంకు అధికారులు కనికరం చూపడం లేదు. అప్పు మొత్తం కట్టాల్సిందేనంటున్నారు. లేదంటే ఆస్తిని జప్తు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చినపెంచలయ్య ఆందోళన చెందుతున్నాడు. ఈ పరిస్థితి ఇతడొక్కడికే పరిమితం కాదు. రుణాలు మాఫీ కాకపోవడంతో జిల్లాలో చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.


నాయుడుపేట : రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాలకు పూర్తిగా జమ కాకపోవడం.. తీసుకున్న అప్పు తడిసి మోపెడు కావడంతో రైతులు అల్లాడిపోతున్నారు. తక్షణమే బకాయిల్ని చెల్లించాలని.. లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకుల అధికారులు హెచ్చరిస్తున్నారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతూ.. పంటలు పండక పూటగడవని దుస్థితిలో ఉన్న రైతులు బ్యాంకు అధికారుల తీరుతో చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. నాయుడుపేట మండలం భీమవరం గ్రామానికి చెందిన కోటపూరి రత్నమ్మ అనే మహిళా రైతు 3.20 ఎకరాల భూమియ పత్రాలను 2007 నెలలో మేనకూరు ఆంధ్రాబ్యాంక్‌లో పెట్టి రూ.10 వేలు పంట రుణం తీసుకుంది. ఆ తరువాత 48 గ్రాముల బంగారాన్ని కుదువపెట్టి రూ.50 వేలు రుణం తీసుకుంది.

ఆ మొత్తాన్ని వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు వినియోగించింది. రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ  చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆనందపడింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలువ లేదు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు తలెత్తి పంటలు పండటం లేదు. పెట్టిన పెట్టుబడులు సైతం చేతికి రాక ఇబ్బందులు పడుతోంది. రుణమాఫీ కింద రూ.26,450 మంజూరైనా ఉపయోగం లేకుండాపోయింది. వాయిదాలు సకాలంలో చెల్లించలేదన్న కారణంగా వడ్డీలపై వడ్డీలు పడ్డాయి. రత్నమ్మ ఇంకా రూ.1,05,800 బకాయి పడింది. పంటలు బాగా పండితే బకాయి మొత్తం తీర్చేద్దామనుకుంది. కానీ.. పరిస్థితి తారుమారైంది. రుణ ఉపశమన పత్రం అక్కరకు రాకుండాపోయింది. తక్షణమే బకాయి చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రత్నమ్మతోపాటు ఆమె కుటుంబ సభ్యులపైనా ఒత్తిడి తెస్తున్నారు.

కూలి సొమ్మునూ జమ చేసుకుని..
భీమవరం గ్రామానికే చెందిన అన్నంరెడ్డి అనసూయమ్మ, ఆమె కుమారుడు బాలాజీరెడ్డిపైనా బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం మంజూరైన సొమ్మును, ఉపాధి హామీ పనులు చేయగా వచ్చిన కూలి డబ్బులను సైతం బ్యాంకు అధికారులు బకాయిల నిమిత్తం జమ చేసుకున్నారు. అదేమని అడిగితే అప్పు తీసుకున్నప్పుడు చెల్లించాలని తెలీదా అని నిలదీస్తున్నారు.

Advertisement
Advertisement