Sakshi News home page

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ ప్రేమ

Published Sat, Oct 8 2016 8:35 AM

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ ప్రేమ - Sakshi

♦  సెల్‌ఫోన్‌లో ప్రియుడి వేధింపులు
మదనపల్లె బస్టాండులో విషం తాగిన యువతి 
చికిత్స పొందుతూ మృతి
మృతురాలు నెల్లూరు వాసి
మదనపల్లె టౌన్‌(చిత్తూరు): ఫేస్‌బుక్‌లో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన యువతి ఏడాదిన్నరగా చాటింగ్‌ చేస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడం, ప్రియుడు ఫోన్‌లో వేధింపులకు పాల్పడడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో గురువారం రాత్రి జరిగింది. టూటౌన్‌ సీఐ హనుమంతునాయక్‌ కథనం మేరకు... నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం యనమడుగుకు చెందిన గొంగటి రమణారెడ్డి, సద్గుణల కుమార్తె పావనిరెడ్డి(23) రెండేళ్ల క్రితం అదే జిల్లా బుజబుజె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎస్‌కే అహ్మద్‌బాషాను ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఆమె సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌చేసి ఫ్రెండ్స్‌ రిక్వస్టులు పెడుతూ వచ్చింది.

కలికిరి టమాటా మార్కెట్‌ యార్డుకు ఎదురుగా ఉన్న ఓ ద్విచక్ర వాహన షోరూమ్‌ డీలర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తనకు పెళ్లయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి ఏడాదిన్నరగా చాటింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రియుడు పెద్ద ఎత్తున నగదు ఇవ్వడంతోపాటు వాహనాన్ని కొనిచ్చినట్లు తెలిసింది. ఆమెకు పెళ్లి అయిందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రియుడు తాను ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె బ్యాంక్‌ కోచింగ్‌ కోసం నంధ్యాలకు వచ్చింది. గురువారం రాత్రి ప్రియుడిని కలిసి సర్దిచెప్పేందుకు మదనపల్లెకు వచ్చింది. అక్కడ ఏమి జరిగిందో కాని తాను చనిపోతున్నట్లు భర్తకు మెసేజ్‌పెట్టి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. పోలీసులు ఆమె వద్ద ఉన్న రూ.14,600 నగదు, రెండు సెల్‌ఫోన్లు, బంగారు నగలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి వెంకటరమణారెడ్డి, భర్త ఎస్‌కే అహ్మద్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 

Advertisement
Advertisement