భార్య దత్తత తీసుకుందనీ.. | Sakshi
Sakshi News home page

భార్య దత్తత తీసుకుందనీ..

Published Fri, Aug 26 2016 11:40 PM

మృతదేహాన్ని పరిశీలిస్తున్న సిఐ చంద్రశేఖర్,క్లూస్‌టీము. - Sakshi

హత్యచేసి పడేసారని కుటుంబ సభ్యుల ఆరోపణ
పోలీసుల అదుపులో డాక్టర్, మరో ఇద్దరు?
మృతుడిది నరసన్నపేట హడ్కోకాలనీ


నరసన్నపేట/ జలుమూరు : నరసన్నపేట హడ్కో కాలనీకి చెందిన యువకుడు మల్లా విజయ్‌ అలియాస్‌ గవాస్కర్‌(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శ్రీముఖలింగం వద్ద వంశధార నది సమీపంలోని ముళ్ల తుప్పల్లో మృతదేహం లభ్యమైంది. విజయ్‌ను నరసన్నపేటలో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో నరసన్నపేట, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంచనలం రేకెత్తించింది. శ్రీముఖలింగం సమీపంలోని ముళ్ల తుప్పల్లో మృతదేహం ఉందని స్థానికులు జలుమూరు పోలీసులకు గురువారం సాయంత్రం సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట సీఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మృతుడు నరసన్నపేటకు చెందిన విజయ్‌గా గుర్తించారు.
 

రెండు రోజుల క్రితమే హత్య!
విజయ్‌ను బుధవారం రాత్రి హత్య చేసి ముళ్ల తుప్పల్లో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో సిబ్బంది శిథిల క్వార్టర్స్‌లో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు, క్లూస్‌ టీం సభ్యులు తనిఖీలు చేసి సాక్ష్యాలను సేకరించారు. ఈ హత్యోదంతంలో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. యువకుడితో సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు బుధవారం సాయంత్రం ఫోన్‌ చేసి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు హత్యలో పాల్గొన్న నిందితులతో కలసి విజయ్‌ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు.  
 

చురుగ్గా కేసు దర్యాప్తు
శ్రీముఖలింగం వీఆర్వో జి.విజయ్‌ బాబు శుక్రవారం జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోలు బంకు ఎదురుగా వంశధార నది ఒడ్డున గుబురు ఔరు మొక్కల మధ్య మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట తరలించారు. ఘటనా స్థ లాన్ని సీఐ చంద్రశేఖర్, జలుమూరు, నరసన్నపేట ఎస్‌ఐలు పి.నరసింహామూర్తి, లక్ష్మణరావు, క్లూస్‌టీం సభ్యులు పరిశీలించారు.


వైద్యునిపై అనుమానాలు..!
ఈ ఘటనలో నరసన్నపేట మారుతీ నగర్‌లోని ఓ నర్సింగ్‌ హోంకు చెందిన వైద్యుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్యునికి, విజయ్‌కు కొద్ది నెలలుగా వివాదం జరుగుతోంది. దీంతో ఆయనే స్థానికంగా కొందరిని పురమాయించి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుని భార్య ఈ యువకుడిని ఇటీవల దత్తత తీసుకున్నారు. అందుకు వైద్యుడు వ్యతిరేకించడంతో పాటు విజయ్‌పై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు విజయ్‌ను పిలిచి రోజూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని ఆదేశించారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇంతలోనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వైద్యుడు ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువ జామునే వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో జమ్ముకు చెందిన ఇద్దరు వ్యక్తులు, హడ్కో కాలనీకి చెందిన మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని సమాచారం. అయితే సమాచారం బయటకు పొక్కడంతో ఆ ప్రయత్నాన్ని విడిచి పెట్టి పరారయ్యారని తెలుస్తోంది.

డాక్టరే హంతకుడు...
మమతా నర్సింగ్‌ హోం నిర్వాహకుడు పొన్నాడ సోమేశ్వరరావే హంతకుడని విజయ్‌ తల్లిదండ్రులు నాగసాయి,భూలక్ష్మి, అమ్మమ్మ సావిత్రి, మేనత్త విజయలు ఆరోపించారు. వీరంతా కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగివస్తుండగా సమాచారం తెలుసుకొని హూటాహుటిన నరసన్నపేటకు చేరుకున్నారు. అనంతరం వీరు విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌ భార్యను విజయ్‌ అమ్మగా భావించాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న తన కుమారుడిని పొట్టన పెట్టుకున్న వైద్యున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి అమ్మమ్మ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన స్నేహిడుతు ఫోన్‌ చేయడంతో గంటలో వచ్చేస్తానని వెళ్లిన విజయ్‌ తిరిగి రాలేదని వాపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement