అమ్మ ప్రసాదం.. వివాదాస్పదం | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రసాదం.. వివాదాస్పదం

Published Tue, May 10 2016 8:57 AM

అమ్మ ప్రసాదం.. వివాదాస్పదం

ప్రసాదం పోటును కొండ కిందకు మార్చేందుకు ఆలయ అధికారుల నిర్ణయం
పైనే ఉంచాలంటున్న శ్రీస్వరూపానందేంద్ర స్వామి
 
విజయవాడ : దుర్గమ్మ ప్రసాదం తయారీ పోటును ఇంద్రకీలాద్రి పైనుంచి కిందకు మార్చాలనే దేవస్థానం అధికారుల నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కొండపైనే లడ్డు, పులిహోర తయారుచేసి అమ్మవారికి నివేదించిన అనంతరం భక్తులకు విక్రయిస్తారు. కొండపై స్థలాభావం ఉన్నప్పటికీ తయారీ అక్కడే జరుగుతోంది. తాజాగా, దుర్గగుడి అభివృద్ధి పేరుతో ప్రసాదాల తయారీ పోటును కిందకు మార్చాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీనిపై భక్తుల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 అన్నదానం సైతం..
 అమ్మవారి దర్శనానంతరం లడ్డు, పులిహోర ప్రసాదాలు తీసుకున్న భక్తులు అన్నదాన భవనంలోకి వెళ్లి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అభివృద్ధి పేరుతో అన్నదానం కార్యక్రమాన్ని కూడా కొండ కిందకు తరలించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దీనిని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వెంటనే తీసుకోవాల్సిన ప్రసాదాలను కొండ దిగువకు వెళ్లిన తరువాత తీసుకోవాలనే అధికారుల ప్రతిపాదనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
 అమ్మ సన్నిధిలోనే ప్రసాదం తినాలి : శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
 దుర్గమ్మ ఆలయంలో పల్లకి సేవ, కంకణాలను ప్రారంభించడానికి వచ్చిన శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ వివాదంపై స్పందించారు. అమ్మవారి సన్నిధిలోనే ప్రసాదాలు తయారు చేయాలని, అక్కడే తినాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఈవో తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అన్నదానం కూడా అమ్మ సన్నిధిలోనే జరగాలని పేర్కొన్నారు. అయితే, తిరుపతి, సింహాచలం మాదిరిగా ఇంద్రకీలాద్రిపై తగినంత స్థలం లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తోందని అధికారులు చెబుతున్నారు.
 
 అమ్మవారి ప్రసాదం కొండపైనే.. : ఈవో ఆజాద్
 అమ్మవారికి, స్వామివారికి నివేదించే ప్రసాదాన్ని మాత్రం ఇంద్రకీలాద్రిపై అర్చకులు తయారు చేస్తారని, భక్తులకు విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు మాత్రమే కింద తయారు చేయిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు. ఇంద్రకీలాద్రి దిగువన మల్లికార్జున మహామడపం నుంచి గోడలు నిర్మిస్తామని, ఈలోపల ఉన్న ప్రదేశమంతా అమ్మవారికే చెందుతుందని, అందువల్ల బయట చేయించామనే భావన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కువ మందికి అన్నప్రసాదం అందించేందుకే అన్నప్రసాద కేంద్రాన్ని తరలిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement