‘స్వచ్ఛ’ కాసులపల్లి... | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ కాసులపల్లి...

Published Thu, Jan 19 2017 10:38 PM

‘స్వచ్ఛ’ కాసులపల్లి...

► ఇంటింటికో ఇంకుడుగుంత
► గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం


పెద్దపల్లిరూరల్‌ : సంపూర్ణ పారిశుధ్య లక్ష్యాల సాధనలో ముందున్న పెద్దపల్లి నియోజకవర్గంలోని  పెద్దపల్లి మండలం కాసులపల్లి,  సుల్తానాబాద్‌  మండలం  సుద్దాలలో బుధవారం కేంద్ర అధికారుల బృందం పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. కేంద్ర ఆర్థిక సలహాదారు తన్నీరుకుమార్, యునిసెఫ్‌ ప్రతినిధి సుధాకర్‌రెడ్డి బృందం ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం, హరితహారం తదితర పథకాల అమలుతీరుపై ఆరా తీసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సొంత గ్రామమైన కాసులపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు స్నానపుగదిని నిర్మించుకోవడాన్ని చూసిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. సర్పంచ్‌ ఇనుగాల తిరుపతిరెడ్డి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంటి ఆవరణలో కూరగాయల చెట్లు, రోడ్ల కిరువైపులా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటి సంరక్షించడాన్ని అభినందించారు.  ప్రతీఇంటి ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించుకోవడంతో మురుగునీటి కాలువల్లోకి నీరు ఎక్కువగా రాక గ్రామంలో దోమల వృద్ధి ఉండదని గ్రామస్తులు వివరించారు. తమ గ్రామంలో నూరుశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించుకున్నామని పేర్కొన్నారు. తమ గ్రామంలో వర్మికంపోస్టు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సహకారమందించాలని సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ చంద్రారెడ్డి కోరారు. అంతర్గత రహదారులు దాదాపుగా అభివృద్ధికి నోచాయని, మిగిలిన కొన్ని రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించుకునేందుకు ఇతర అభివృద్ధి పనులకోసం నిధులను ఇప్పించాలని కోరారు.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
సుల్తానాబాద్‌ రూరల్‌: మండలంలోని సుద్దాల గ్రామాన్ని  కేంద్ర బృందం పరిశీలించింది. గ్రామంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య పనుల గురించి పరిశీలించింది. గ్రామస్తులతో సభ్యులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛభారత్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సమీర్‌కుమార్‌ మాట్లాడుతూ అందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. రాష్ట్ర యుని సెఫ్‌ కోఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీఎంలు రమేశ్, లింగస్వామి, రాఘవులు, ఎంపీడీవో వినోద్, తహసీల్దార్‌ రజిత,  సర్పంచ్‌ అంజలి, గ్రామస్తు లు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement