మార్కెట్‌లో మధుర ఫలం | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో మధుర ఫలం

Published Tue, Sep 27 2016 1:02 AM

Sweet fruit market

కొంత ఆలస్యమైనప్పటికీ మార్కెట్లోకి మధుర ఫలాలు వచ్చేశాయి. ఈ ఏడాది వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సాధారణంగా వినాయకచవితికి ముందే మార్కెట్లో కనిపించే సీతాఫలాలు ఈసారి దసరా దగ్గర పడుతున్నా సరైన పక్వానికి రాలేకపోయాయి. పేదోడి యాపిల్‌గా.. మధుర ఫలంగా పేరుగాంచిన సీతాఫలం.. ఇప్పుడు అరుదైన ఫలంగా మారింది. ఆలస్యంగానైనా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న సీతాఫలాలకు డిమాండ్‌ బాగానే పెరిగింది. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ సీతాఫలాల విక్రయాలు జోరుగా సాగుతాయి.
– గుమ్మఘట్ట

పెరిగిన ధరలు:
గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి, చెరువుదొడ్డి, గొల్లపల్లి, అడిగుప్ప, 75 వీరాపురం, రాయదుర్గం, పైతోట ఇతర గ్రామాల్లో సుమారు 500కు పైగా కుటుంబాలు సీతాఫలం విక్రయాలపైనే జీవనాధారం పొందుతున్నారు. అతి చౌకగా లభించే ఈ మధుర ఫలాలు ఈ ఏడు దిగుబడి తగ్గడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. సీజన్‌లో మాత్రమే వచ్చే పండ్లు కావడంతో వీటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. రాయదుర్గంలో ఒక గంప సీతాఫలం రూ.250 నుంచి రూ. 350 వరకు ధర పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయంలో రూ. వంద నుంచి రూ.150 లోపు విక్రయాలు జరిగాయి. ఒక గంపలో సుమారు 80 నుంచి 100 కాయల వరకు ఉంటాయి. విడిగానైతే చిన్న సైజులో ఉన్న పండ్లు రూ. 10కి మూడు, పెద్ద సైజులో ఉన్న వాటికి రూ.10కి ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు.

ఆరోగ్య ప్రదాయిని
సీతాఫలాలు రుచికే కాదు .. ఆరోగ్య పరంగానూ చాలా మంచివిగా పేర్కొంటున్నారు. వీటిని అరగిస్తే అజీర్తి, మలబద్దకం, రక్తహీనత తదితర సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి వాటిని జుట్టుకు అంటì స్తే చుండ్రును నివారించవచ్చు. లవణాలు, పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో శరీరం దృఢంగాను, ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement
Advertisement