స్వైన్‌ ఫ్లో! | Sakshi
Sakshi News home page

స్వైన్‌ ఫ్లో!

Published Thu, Feb 16 2017 11:12 PM

స్వైన్‌ ఫ్లో! - Sakshi

- జిల్లాలో పంజా విసురుతున్న స్వైన్‌ఫ్లూ
- చాగల్లులో 8 నెలల బాలుడి మృతి
- మరో మహిళ పరిస్థితి విషమం!
- బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స
- వాస్తవాలను తొక్కిపెడుతున్న అధికారులు  


అనంతపురం మెడికల్‌ : జిల్లాపై స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. ఈ వ్యాధితో తాజాగా ఓ బాలుడు మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. వైద్య,ఆరోగ్యశాఖ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది. పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన గౌతమ్‌ (8 నెలలు) లుకేమియాతో బాధపడుతుండేవాడు.  ఇటీవల తల్లిదండ్రులు  తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ గళ్ల పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 13న రాత్రి మెరుగైన వైద్యం కోసం వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) ఆస్పత్రికి గానీ, వేరే ఆస్పత్రికి గానీ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.

అయితే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్వగ్రామానికి తీసుకొచ్చేశారు. 15వ తేదీన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఈ విషయం తెలిసింది. వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ఉన్న స్వైన్‌ఫ్లూ వార్డులో ఆ చిన్నారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. చాగల్లు నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే చిన్నారి మృతి చెందాడు.  ఆ గ్రామానికి ప్రత్యేక వైద్య బృందం వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించింది.

ముందస్తుగా  మందులు కూడా పంపిణీ చేశారు. గ్రామస్తులందరికీ మాస్కులు అందజేశారు. చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివారులో దహనం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ కోన శశిధర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  కాగా.. పుట్టపర్తికి చెందిన మరో మహిళ (38) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఈమె బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి ప్రత్యేక బృందంతో అక్కడికెళ్లి వైద్యులతో మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం గళ్లను సేకరించి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కుటుంబానికే చెందిన మరో ముగ్గురు కూడా అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం.

ప్రాణాలు పోతున్నా పట్టదా?
స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గోప్యత పాటిస్తున్నారు. జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ 9న రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. అక్టోబర్‌ 22న కదిరి మండలం కుమ్మరివాండ్లపల్లికి చెందిన మరో మహిళ మృతిచెందింది. ఈ రెండు ఘటనలు జనవరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్వైన్‌ఫ్లూ మరణాలు జరిగాక ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు గోప్యత పాటిస్తుండడంపై విమర్శలొస్తున్నాయి.

తీరా ప్రాణాలు పోయాక కంటితుడుపు చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారు. తాజాగా చిన్నారి గౌతమ్‌ మృతిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణను ‘సాక్షి’  సంప్రదించగా.. ‘బాలుడికి లుకేమియా ఉందట. స్వైన్‌ఫ్లూ నా, కాదా అన్నదానిపై రిపోర్టులు చూడాలి. బత్తలపల్లిలో చికిత్స పొందుతున్న మహిళ విషయంలో స్వైన్‌ఫ్లూగా అనుమానం ఉంది’ అని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement