సిండి‘కేట్లు’ | Sakshi
Sakshi News home page

సిండి‘కేట్లు’

Published Wed, Sep 21 2016 8:49 PM

సిండి‘కేట్లు’

క్వింటా ఉల్లి ధర రూ.100
– సరుకు బాగుంటే సైగలతో సిండికేట్‌
– ఎకరాకు కనీస పెట్టుబడి రూ.50వేలు
– దిగుబడి అమ్మితే వచ్చేది రూ.9వేలు
– రవాణా చార్జీలూ దక్కని వైనం
– రోడ్డెక్కిన ఉల్లి రైతులు
– దిగుబడులు పారబోసి నిరసన
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి రైతు దగా పడుతున్నాడు. ఒక్క ఏడాదిలో పరిస్థితి తలకిందులయింది. గత ఏడాది లాభాలను ఆర్జించిన రైతు ఈ విడత నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. క్వింటా ఉల్లి ధర రూ.100లకు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వ్యాపారులు నాణ్యత కలిగిన ఉల్లి లాట్‌ కనిపిస్తే చాలు.. సిండికేట్‌ అయిపోతున్నారు. సైగలతో ధర పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసిన నాణ్యమైన ఉల్లిని ఆ తర్వాత పంచుకోవడం కర్నూలు మార్కెట్‌లో పరిపాటిగా మారింది. బుధవారం వేలం రూ.50లతో మొదలుపెట్టి రూ.100లకే ముగించడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటా ఉల్లి రూ.700 ప్రకారం కొంటున్నట్లు చెబుతుండగా.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం. రిటైల్‌ మార్కెట్‌లో ఒక మాదిరి నాణ్యత కలిగిన ఉల్లి కిలో రూ.10 చొప్పున విక్రయిస్తుంటే.. మార్కెట్‌లో క్వింటా ధర రూ.100 ప్రకారం కొంటామని వ్యాపారులు చెప్పడం రైతులను కలచివేస్తోంది. 
 
సీఎం డౌన్‌డౌన్‌
మోసపూరిత వేలం పాటను బంద్‌ చేయించిన రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ ధర్నా చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన మధ్యాహ్నం ఒంటి గంటకు పైగా సాగింది. చూడండి.. ఈ ఉల్లి బాగోలేదా అంటూ బస్తాల కొద్దీ ఉల్లిని రోడ్డుపై గుమ్మరించారు. ధర్నాతో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున స్తంభించింది. ఆ తర్వాత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వద్ద చర్చలు జరుగుతున్నాయంటూ పోలీసులు రైతులచేత బలవంతంగా ధర్నాను విరమింపజేశారు. రైతులకు సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు.
 
గత ఏడాది రూ.4వేలతో కొనలేదా?
‘‘గత ఏడాది ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా రూ.4వేలతో కొనుగోలు చేసి ప్రజలకు కిలో రూ.20 చొప్పున పంపిణీ చేసింది. ఇప్పుడు ధరలు పడిపోయిన నేపథ్యంలో కనీసం రూ.1000లతో కూడా కొనుగోలు చేయకపోవడం ఏమిటి.’’ అని రైతులు ప్రశ్నించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శమంతకమణి, కార్యదర్శి నారాయణమూర్తి, వైస్‌ చైర్మన్‌ దేవేంద్రరెడ్డిలు రైతుల వద్దకు చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
 
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ఉల్లి ధర పూర్తిగా పడిపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శమంతకమణి తెలిపారు. రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు.
 
ఈ ఉల్లిలో నాణ్యత లేదా..
ఈ ఉల్లిలో నాణ్యత లేదా.. ఇదే ఉల్లిని రిటైల్‌గా కిలో రూ.10 ప్రకారం అమ్ముతున్నారు. మార్కెట్‌లో మాత్రం వేలం పాట రూ.50 దగ్గర మొదలు పెట్టి రూ.100 వద్ద ముగిస్తున్నారు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెడితే.. ఇలా యాభై వంద రూపాయలకు అమ్మితే ఎట్లా బతికేది. రవాణా ఖర్చులు కూడా వస్తలేవు.
– చిన్న రామాంజనేయులు, గుమ్మకొండ
 

Advertisement
Advertisement