ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం: వీహెచ్ | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం: వీహెచ్

Published Mon, Jul 4 2016 6:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం: వీహెచ్ - Sakshi

విజయవాడ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పురాతన, చారిత్రక ఆనవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూలగొడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అన్నాహజారే స్ఫూర్తి అని చెప్పే ముఖ్యమంత్రి.. ఆయన ప్రతిష్ఠించిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా కూలగొట్టడం దారుణమైన విషయమన్నారు.

వేల సంవత్సరాల క్రితం అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతంగా భావించే విజయేశ్వరి ఆలయాన్ని కూలగొట్టడం నియంతృత్వ పాలన కాక ఇంకేమిటని ప్రశ్నించారు. అయోధ్యలో రాయాలయం నిర్మిస్తామంటున్న ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ వంటి సంస్థలు, తిరుమలలో వెయ్యికాళ్ల మండపం కూల్చినప్పుడు శాపనార్థాలు పెట్టిన చినజీయర్ స్వామీజీ.. వీరంతా ఇప్పుడు ఎక్కడికి పోయారన్నారు. ప్రతిరోజూ పూజారి వేషధారణలో గుడికి వెళ్లే గవర్నర్ నరసింహన్ నోరు మెదపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

విజయవాడలో జరుగుతున్న అరాచకాలపై ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినైనా.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్నారు. ఇప్పటి సీఎం విదేశాలను పొగడడం ఫ్యాషనయిందని, అందుకే వీరికి దేశీయ సంప్రదాయాలు తెలియడం లేదన్నారు. కూల్చివేసిన గుళ్లను పునర్నిర్మించేవరకు ఆందోళన ఆగదని వీహెచ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Advertisement
Advertisement