కర్నూలులో తొలిసారిగా 'తానా' | Sakshi
Sakshi News home page

కర్నూలులో తొలిసారిగా 'తానా'

Published Wed, Dec 21 2016 9:31 PM

తానా నాటిక పోటీలకు సిద్ధమవుతున్న టీజీవీ కళాక్షేత్రం

–  నేటి నుంచి ప్రారంభం కానున్న తానా జాతీయ స్థాయి నాటిక పోటీలు
– ప్రతి రోజు మూడు నాటికలు
– 24న బహుమతి ప్రదానం
– ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం
 
కర్నూలు(కల్చరల్‌): కళల కాణాచియైన కర్నూలు జిల్లా తొలిసారిగా 'తానా' జాతీయ స్థాయి నాటిక పోటీలకు వేదికగా మారింది. తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) సంస్థ ప్రతి రెండేళ్లకొకసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశిష్టాత్మకమైన నగరాల్లో కళా ప్రదర్శనలు చేపడుతోంది. తొలిసారిగా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలునగరంలోని స్థానిక సీ.క్యాంపు సెంటర్‌లో ఉన​ న టీజీవీ కళాక్షేత్రంలో ఇవి జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నాటక సమాజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది నాటక సంస్థలు ఈ పోటీలలో పాల్గొననున్నాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు తానా నాటిక పోటీలు ప్రారంభోత్సవం జరగనున్నది. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎస్పీ ఆకె రవికృష్ణ, తానా అధ్యక్షుడు డా.జంపాల చౌదరి, తానా నియమిత అధ్యక్షుడు సతీష్‌ వేమన, సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, చైర్మన్‌ టీజీ భరత్, కన్వీనర్‌ ముప్పా రాజశేఖర్, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
 
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన లలిత కళా సమితి:
గత నాలుగు దశాబ్దాలుగా కర్నూలులో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, జానపద, శాస్త్రీయ నృత్య కళారూపాలను ప్రదర్శిస్తూ లలిత కళాసమితి రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళా సంస్థగా గుర్తింపు పొందింది. ప్రముఖ రంగస్థల నటుడు సయ్యద్‌ అహ్మద్, స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నంది నాటకోత్సవాల్లో స్వర్ణ నందిని, రజతనంది, తామ్రనందిని కైవసం చేసుకుంది. పులిస్వారీ అనే ఒక సాంఘిక నాటకాన్ని నూట ఇరవై సార్లు ప్రదర్శించి అరుదైన రికార్డులను దక్కించుకుంది. ప్రతియేటా మే నెలలో రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహిస్తూ రంగస్థల నటలను ప్రోత్సహిస్తోంది.
 
ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం :
గురువారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న తానా నాటిక పోటీలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య   ప్రకటనలో తెలిపారు. సురభవారి ఆధ్వర్యంలో వేదికను ప్రత్యేక కర్టన్లతో ముస్తాబు చేశామన్నారు. కుటుంబ సమేతంగా ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రేక్షకులు నాటికలను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.   రోజు మూడు నాటికలను ప్రదర్శిస్తారని, ఇద్దరు ప్రముఖ రంగస్థల నటులను సన్మానిస్తారని ఆయన తెలిపారు. 22, 23న సాయంత్రం, 24న ఉదయం 10 గంటల నుంచి ప్రదర్శనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 24న సాయంత్రం నాటిక పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేస్తామన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు రంగయాత్ర సంస్థ కళాకారులు 'అనంతం' నాటికను 7.30 గంటలకు చైతన్య భారతి, కరీంనగర్‌ కళాకారులు 'దొంగలు' నాటికను 8.30 గంటలకు గణేష్‌ ఆర్ట్స్‌ గుంటూరు కళాకారులు 'అంతాబ్రాంతియే' నాటికను ప్రదర్శిస్తారన్నారు. కళాభిమానులు వీటిని తిలకించి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞాప్తి చేశారు. 
 

Advertisement
Advertisement