వీడని తనూజ కేసు మిస్టరీ | Sakshi
Sakshi News home page

వీడని తనూజ కేసు మిస్టరీ

Published Thu, Jul 28 2016 9:53 AM

వీడని తనూజ కేసు మిస్టరీ - Sakshi

 పెందుర్తి : కృష్ణరాయపురంలో ఓ అపార్ట్‌మెంట్ పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన 14 ఏళ్ల బాలిక తనూజ కేసులో పురోగతి అంతగా లేదు. బాలిక మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినప్పటికీ అవి కేసును ఛేదించలేకపోతున్నాయి. మంగళవారం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో బాలికది అసహజ మరణం అని మాత్రం స్పష్టమైంది.
 
తీవ్రమైన గాయాలు, ఒంట్లో ఎముకలు విరిగిపోవడంతోనే ఆమె మరణించిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. అంతకుమించి ఆధారాలు ఆ రిపోర్ట్‌లో లేవని పోలీసులు చెబుతున్నారు. కేసులో మరిన్ని ఆధారాల కోసం బాలిక కీలక శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
 
మరో పది రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నివేదిక వస్తే కేసు మిస్టరీ కొంత వరకు వీడవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బాలిక స్నేహితుడిపైనే దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు మరో కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
 
తనూజ స్నేహితుడి ప్రమేయాన్ని బలంగా విశ్వసించిన పోలీసులు అతడితో పాటు మరో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారించారు. కానీ నిందితుల్లో ఒకడిగా భావించిన యువకుడి మేనమామతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు మంగళవారం రాత్రి విడిచిపెట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తనూజ స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. వీరి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదని బోగట్టా. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని ఆ యువకుడు చెబుతున్నట్లు తెలిసింది.
 
 పాపం ఎవరిదీ?
 తనూజ ఓ యువకుడితో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడం చూశామని ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌తో పాటు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది ప్రశ్న తేలడం లేదు. ఈ ప్రాంతంలో నిత్యం రాత్రి సమయంలో మద్యం సేవించి రోడ్లపై తిరిగే ఆకతాయిలు కోకొల్లలు. రౌడీ గ్యాంగ్‌లకు లెక్కే లేదు. ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చేసిన తనూజ వారి వలలో చిక్కుకుపోయిందా? అన్న సందేహం కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement