ఒంగోలు కార్పొరేషన్ లో ... పడకేసిన పన్నులు | Sakshi
Sakshi News home page

ఒంగోలు కార్పొరేషన్ లో ... పడకేసిన పన్నులు

Published Wed, Mar 16 2016 4:23 AM

ఒంగోలు కార్పొరేషన్ లో ... పడకేసిన పన్నులు - Sakshi

ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.6 కోట్ల పైనే
రెవెన్యూ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సమన్వయ లోపం
గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది సగం శాతమే వసూలు


ప్రభుత్వ శాఖల  నుంచి రావలసిన పన్నుల బకాయిలు రూ.6కోట్ల పైనే ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాలు, సమావేశ మందిరాలు కలిపి మొత్తం రూ.6 కోట్ల 7లక్షల 96వేల రూపాయలు బకాయిలున్నారుు. జిల్లా కలెక్టరేట్ (ప్రకాశంభవనం) అక్షరాలా రూ.23 లక్షల  పన్ను బకాయి ఉంది. కలెక్టర్ బంగళా పన్ను రూ.5.74 లక్షలు బకాయి పడింది. ఆర్ అండ్ బీ  భవనాలకి సంబంధించి అత్యధికంగా రూ.3కోట్ల వరకూ బకాయిలుండటం గమనార్హం. జిల్లా కోర్టుల సముదాయం రూ.5.43 లక్షలు  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూ.1.53 లక్షలు పోలీసు కళ్యాణ మండపం రూ.14 లక్షలు,  ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (పాత రిమ్స్) రూ.56.92 లక్షలు ఉన్నాయి. పన్నుల వసూళ్ల కోసం తిరిగే నగరపాలక సిబ్బందికి సంబంధించిన ఆస్తి పన్నుల బకాయిలే దాదాపుగా రూ.2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

ఒంగోలు అర్బన్:  నగరపాలక సంస్థలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు రూ.6కోట్లు పడకేశారుు. దీనికి కారణం రెవెన్యూ విభాగంలో అధికారులకు సిబ్బందికి మధ్య సమన్వయ లోపంగా కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 16న రెవెన్యూ అధికారి మంజులా కుమారిని డీఎంఏ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీహరిని ఇన్‌చార్జి ఆర్‌ఓగా నియమించారు. అప్పటి నుంచి అదే సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వరకు ఇన్‌చార్జి ఆర్‌ఓ పర్యవేక్షణలోనే రెవెన్యూ విభాగం పనిచేసింది. పాలనా సౌలభ్యం కోసం గత నాలుగు మాసాల క్రితం ఏళ్ల తరబడి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో కొంతమందిని వేరే విధులను కేటాయించి ఆ స్థానంలో కొత్తగా మరికొంతమందిని తీసుకోవాలని కమిషనర్ భావించారు.  కానీ ఈ సీట్లకు బయట ఆదాయం రావడంతో స్థానిక ఎమ్మేల్యేతోపాటు ఇతర తెలుగు తమ్ముళ్ల ఆశీస్సులతో కొంతమంది పోస్టులను దక్కించుకున్నారు. అయినా పన్నుల వసూలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ముందుకు కదల లేదు.

 ఈ ఏడాది ఇప్పటి వరకు పన్నుల వసూలు 51 శాతమే..
నగరంలో ఉన్న మొత్తం అసిస్‌మెంట్లు 42,962కి గాను 2015-16కి వసూలు చేయాల్సిన పన్ను రూ.20.19 కోట్లు. దీంతో ఇప్పటికి దాదాపుగా రూ.10 కోట్ల వరకు వసూలు చేసి 51 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇంకా రూ.10 కోట్ల వరకువసూలు చేయాల్సి ఉంది. మార్చి నెల కావడంతో బృందాలుగా ఏర్పడి నగరంలో హడావుడి చేయడానికే రెవెన్యూ యంత్రాంగం పరిమితవుతోంది గానీ పైసలు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలున్నారుు. నీటి పన్ను రూ.4 కోట్ల 9లక్షలుండగా దానిలో రూ.1కోటి 56 లక్షలు వసూలు చేసి 38.17 శాతం పూర్తి చేశారు.

Advertisement
Advertisement